by Suryaa Desk | Mon, Nov 25, 2024, 10:15 PM
బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుపై మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే ఆయనను ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని.. విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజధాని ఢాకా నుంచి చిట్టగాంగ్ వెళ్లేందుకు చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు.. సోమవారం హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా అక్కడే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసిస్తూ చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు.. అనేక చర్యలు చేపట్టారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక దాడులకు వ్యతిరేకంగా ఇస్కాన్ చిన్మయ్ అనేక ర్యాలీలు నిర్వహించి.. మహ్మద్ యూనస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఖండించారు. బంగ్లాదేశ్‌లోని సనాతన్ జాగరణ్ మంచ్ ప్రతినిధిగా చిన్మయ్ ప్రభు ఉన్నారు. ఈ క్రమంలోనే గత నెల 30వ తేదీన బంగ్లాదేశ్‌లో జాతీయ జెండాను అవమానించినందుకు చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు సహా 13 మందిపై దేశద్రోహ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే బంగ్లాదేశ్ పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 25వ తేదీన లాల్దిఘిలో జరిగిన ర్యాలీలో.. బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎక్కువ ఎత్తిలో ఇస్కాన్‌కు చెందిన కాషాయరంగు జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలోనే పలువురిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి.
ఇక ఈ ఏడాది ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం ప్రారంభం అయింది. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అప్పటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా పారిపోయి.. భారత్‌కు వచ్చి తలదాచుకుంటున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో కొలువుదీరింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులు, ఇతర మైనారిటీలపై తీవ్ర హింసాత్మక దాడులు పెరిగాయి. ఈ దాడుల నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఇక అక్టోబర్ నుంచి చిట్టగాంగ్‌లో మైనారిటీల రక్షణ, హక్కులను డిమాండ్ చేస్తూ సనాతన్ జాగరణ్ మంచ్ నిరసనలు ప్రారంభించింది. ఇందులో చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హిందూ మైనారిటీల కోసం 8 ప్రధాన డిమాండ్లపై ఆయన పోరాటం చేశారు. బంగ్లాదేశ్‌లో ఉన్న మైనారిటీలపై దాడులు, నేరాలకు పాల్పడే వ్యక్తులను విచారించేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని.. ఈ ఘటనల్లో బాధితులుగా మారిన వారికి పరిహారం, పునరావాసం కల్పించాలని.. మైనారిటీ రక్షణ చట్టం అమలు చేయాలని.. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యాసంస్థలు, హాస్టళ్లలో మైనారిటీలకు ప్రార్థనా స్థలాలు, పూజా గృహాల నిర్మాణంపై చిన్మయ్ కృష్ణ దాస్ గళం వినిపించారు. ఈ క్రమంలోనే హిందూ, బౌద్ధ, క్రైస్తవ, సంక్షేమ ట్రస్టులకు ఆస్తి బదిలీ చట్టం అమలు చేయాలని.. పాలీ-సంస్కృత విద్యా మండలి ఆధునీకరణ చేయాలని.. దుర్గాపూజ సందర్భంగా 5 రోజుల సెలవులను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Latest News