మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్..
 

by Suryaa Desk | Mon, Nov 25, 2024, 10:17 PM

మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించి రెండు రోజులు గడిచినా.. ఇంకా ముఖ్యమంత్రి ఎవరు అనేది మాత్రం ఇంకా తేలలేదు. అయితే మంగళవారంతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుండటంతో కొత్త సీఎం ఎవరు అనే ఉత్కంఠ పెరిగిపోతూ ఉంది. అయితే మహాయుతిలో ఉన్న మూడు పార్టీలైన బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీలు ఎవరికి వారు.. తమ నేతలే సీఎం అని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే దేవేంద్ర ఫడ్నవీస్‌నే సీఎం చేసేందుకు అజిత్ పవార్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ హైకమాండ్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్‌కే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు సుముఖత చూపుతోంది. అయితే షిండే వర్గం కూడా గట్టిగా డిమాండ్ చేస్తుండటంతో అసలు సమస్య వచ్చిపడింది.


ఈ నేపథ్యంలోనే తాజాగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇక రెండు ఉపముఖ్యమంత్రి పదవులను ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లకు కేటాయించనున్నట్లు సమాచారం. ఇదే నిర్ణయం ఫైనల్ అయిందని.. ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ ఇదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గం విషయానికి వస్తే.. షిండే శివసేనకు 12, ఎన్సీపీకి 10 బెర్తులు ఇవ్వనున్నట్లు సమాచారం.


ఇక మరో ఆప్షన్ కూడా తెరపైకి వచ్చింది. దేవేంద్ర ఫడ్నవీస్‌కు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి.. ఆ తర్వాత రెండున్నరేళ్ల పాటు ఏక్‌నాథ్ షిండే‌కు అవకాశం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇక ఒకసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ దిగిపోతే.. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవిని ఆశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


మరోవైపు.. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్‌ పవార్‌లతో కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకారం గురించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం ముంబైలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 288 స్థానాలకు గానీ 235 సీట్లు సాధించింది. ఇందులో బీజేపీ 132 సీట్లు, షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు దక్కించుకుంది.


Latest News
SC raps HP govt over denying employment to an Asian gold medallist Thu, Nov 28, 2024, 04:46 PM
Over 100 killed in sectarian clashes in Pakistan Thu, Nov 28, 2024, 04:39 PM
Selfish politics: BJP's Navneet Rana hits out at SS (UBT) Thu, Nov 28, 2024, 04:38 PM
Khalistani terrorist Pannun issues threat video to disrupt DGP conference in Odisha Thu, Nov 28, 2024, 04:37 PM
Hemant Soren sworn in as Jharkhand's 14th CM, top INDIA Bloc leaders attend Thu, Nov 28, 2024, 04:33 PM