by Suryaa Desk | Mon, Dec 23, 2024, 08:52 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్.. జవనరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నికల సమయంలో వెన్నంటి నిలిచిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు తన క్యాబినెట్‌లో ట్రంప్ సముచిత స్థానం కల్పించారు. ఓ రకంగా ట్రంప్ 2.0లో మస్క్ కీలక పాత్ర పోషిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలో మస్క్ గురించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరిజోనాలోని ఫొనిక్స్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఏదో ఒక రోజున మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా? అని అడిగిన ప్రశ్నకు.. లేదు అని ట్రంప్ సమాధానం ఇచ్చారు. అందుకు కారణం ఆయన ఈ దేశంలో జన్మించకపోవడమేనని ఆయన చెప్పారు.
‘‘అతడు అధ్యక్షుడు కాలేరు.. ఇది నేను చెప్పగలను.. అందుకు కారణం ఏంటంటే.. మస్క్ ఈ దేశంలో పుట్టలేదు’’ అని అన్నారు. అమెరికా పౌరుడైన ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. అమెరికా రాజ్యాంగ నిబంధనలు ప్రకారం.. అధ్యక్షుడిగా పోటీచేసే వ్యక్తి ఆ దేశంలో జన్మించి ఉండాలి. ఇక, ట్రంప్ అధ్యక్షుడైనా.. అధికారం మొత్తం మస్క్ చెలాయిస్తారని డెమొక్రాట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు ట్రంప్ దీటుగా బదులిచ్చారు. అలా ఎన్నటికీ జరగదని స్పష్టం చేశారు.
మస్క్ షాడో అధ్యక్షుడిగా మారుతారని, ఎన్నికకాని వ్యక్తి అధికారాన్ని చెలాయిస్తాడనే ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. అయితే, రిపబ్లికన్‌లలోనూ మస్క్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా జో బైడెన్ తీసుకొచ్చిన బిల్లుకు మస్క్ సూచనతోనే ట్రంప్ మద్దతు ఇచ్చారని ఆ పార్టీలో అసమ్మతి రాజుకుంది. ఈ బిల్లు ప్రతినిధుల సభలో ఆమోదం పొందడంతో షట్‌డౌన్ గండం నుంచి అమెరికా తప్పించుకుంది. లేకుంటే అధికార మార్పిడికి కూడా సంక్లిష్టమయ్యేది నిపుణులు చెబుతున్నారు.
ముందు ఈ బిల్లును ట్రంప్ తిరస్కరించారు. ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతోపాటు, వివిధ ఆర్థిక అంశాలను నిర్వర్తించేందుకు రెండేళ్లపాటు రుణాలపై పరిమితిని ఎత్తివేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించిన బైడెన్ యంత్రాంగం.. మార్పులు చేసి బిల్లును ప్రవేశపెట్టింది.
Latest News