by Suryaa Desk | Mon, Dec 23, 2024, 09:58 PM
ప్రముఖ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ రంగ కంపెనీ సోలార్ 91 క్లీన్ టెక్ సంస్థ పబ్లిక్ ఇష్యూకు చివరి నిమిషంలో బ్రేక్ పడింది. ఈ ఐపీఓ యాంకర్ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 23, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 24వ తేదీన సబ్‌స్క్రిప్షన్ కోసం రావాల్సి ఉంది. అయితే, ఈ ఎస్ఎంఈ ఐపీఓ ప్రారంభం కావాల్సిన చివరి నిమిషంలో వాయిదా వేస్తున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజీ (BSE) వెల్లడించింది. ఈ కంపెనీపై మీడియాలో వచ్చిన ఫిర్యాదులు, సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఎస్ఈ తెలిపింది.
'మీడియాలో వస్తున్న ఫిర్యాదులపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సోమవారం మొదలు కావాల్సిన సోలార్ 91 క్లీన్ టెక్ యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్, మంగళవారం మొదలవాల్సిన పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ తదుపరి నోటీసులు వచ్చే వరకు వాయిదా వేస్తున్నాం.' అని బీఎస్ఈ నోటీసులు జారీ చేసింది. వాయిదా పడేందుకు ఓ ప్రధాన కారణం ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ ఏడాది మే నెలలో ఈ కంపెనీ తన వాల్యువేషన్ కొన్ని రోజుల్లోనే రెండున్నర రెట్లు పెరిగిందని ప్రకటించింది. దీనిపై పారిశ్రామిక వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. మీడియాల్లో ఫిర్యాదులు వచ్చిన క్రమంలో బీఎస్ఈ చివరి నిమిషంలో ఐపీఓ వాయిదా వేసింది.
రాజస్థాన్‌లోని జైపుర్ కేంద్రంగా సేవలందిస్తోంది ఈ సోలార్ 91 క్లీన్ టెక్ కంపెనీ. దీనిని నలుగురు ఐఐటీ పూర్వ విద్యార్తులు 2015లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కమర్షియల్, ఇండస్ట్రీయల్ అవసరాల కోసం ఈ సంస్థ ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ సేవలు అందిస్తుంది. రూ. 106 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంది. ఇందులో భాగంగా 54. 36 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ. 185 నుంచి రూ. 195గా నిర్ణయించారు. డిసెంబర్ 24 నుంచి సబ్‌స్క్రిప్షన్ మొదలు కావాల్సి ఉంది.