by Suryaa Desk | Mon, Dec 23, 2024, 10:15 PM
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించి.. భారత జెండాను రెపరెపలాడించిన షూటర్ మను భాకర్ పేరు.. ఖేల్ రత్న పురస్కారాల కోసం నామినేషన్‌ల జాబితాలో లేకపోవడం వివాదాస్పదంగా మారింది. వాస్తవంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డుల కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాబితాను సిద్ధం చేస్తుంది. అయితే ఇందులో మను భాకర్ పేరు లేదని తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా చర్చకు తెరలేపింది. ఒకే ఒలింపింక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణి పేరు లేకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు కోసం భారత క్రీడా మంత్రిత్వ శాఖ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మను భాకర్ పేరు ఉంటుందని అంతా భావించారని.. కానీ ఆ లిస్ట్‌లో ఆమె పేరు లేదనే ప్రచారం జరుగుతోంది. దీనిపై విమర్శలు రాగా.. అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు! అసలు ఈ అవార్డు కోసం మను భాకర్ దరఖాస్తు చేసుకోలేదనే విషయాన్ని వెల్లడించారు! దీనిపై స్పందించిన మను భాకర్ తండ్రి రామ్ కిషన్ భాకర్.. అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రీడా అత్యున్నత పురస్కారం కోసం తాము ఇదివరకే దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
“ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్ కూడా అవార్డుల కోసం అడగాలా? మీరు అథ్లెట్లను ప్రోత్సహించే పద్ధతి ఇదేనా? ఏంటో ఈ విషయం నాకు అస్సలు అర్థం కావడం లేదు. మేం అవార్డు కోసం దరఖాస్తు చేశాం. కానీ, కమిటీ నుంచి మాత్రం ఎలాంటి ప్రతి స్పందన రాలేదు. ఇలాగైతే తమ పిల్లలను క్రీడల్లో పాల్గొనమని తల్లిదండ్రులు ఎలా ఎంకరేజ్ చేస్తారు? వారిని కూడా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మారమని చెబుతారు కదా?” అని రామ్‌కిషన్ భాకర్ వ్యాఖ్యానించారు.
కాగా ఈ ఏడాది జరిగిన పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. మహిళల 10మీ మహిళల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని.. ఈ క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. ఆ తర్వాత సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలోనూ మను భాకర్ కాంస్యం సాధించింది. దీంతో స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా ఆమె నిలిచింది. దీంతో ఇలాంటి క్రీడాకారిణికి అవార్డు ఇవ్వకపోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా మను బాకర్‌కు 2020లో అర్జున పురస్కారం దక్కింది.
Latest News