by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:04 PM
విజయనగరం జిల్లా, రామభద్రపురం పరిధిలోని ఆరిక తోట జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం మేరకు.. విజయనగరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బొండపల్లి మండలంలోని గరుడబిల్లికి చెందిన రెడ్డి మహాలక్ష్మి ముందు సీటులో కూర్చొంది. ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు ఉన్నారు. ముందు వెళ్తున్న లారీ వేగం డ్రైవర్ ఒక్కసారిగా తగ్గించాడు. అదే సమయంలో వెనుకన ఉన్న బస్సు నెమ్మదిగా వెళ్తోంది. ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో లారీ బస్సును ఢీకొంది. దీంతో మహాలక్ష్మి రెండు కాళ్లు డ్రైవర్ సీటు పక్కనే ఉన్న క్యాబిన్‌లో ఇరుక్కుపోయాయి.
ఆమె బయటకు రాలేకపోవడంతో రెండు గంటలపాటు బస్సులోనే నరకయాతన అనుభవించింది. ఎస్‌ఐ వెలమల ప్రసాద్ ఆధ్వర్యంలో ఆరికతోట బీసీకాలనీకి చెందిన యువత, కొంతమంది ప్రయాణీకులు యంత్రాలతో లారీని, బస్సును వేరుచేసి ఆమెను బయటకు తీశారు. రెండుకాళ్లు ఇరుక్కుపోవడంతో ఆమె హాహాకారాలు చేసి బాధతో అల్లాడిపోయింది. ఈ ప్రమాదంలో మహాలక్ష్మి రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. బయటకు తీసిన ఆమెను రామభద్రపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది ప్రయాణీకులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలాన్ని ఆర్టీవో రామ్మోహనరావు, తహసీల్దార్ ఆకుల సులోచనారాణి పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహాలక్ష్మితో మాట్లాడారు. ఈ మేరకు ఎస్‌ఐ ప్రసాద్ కేసు నమోదుచేశారు. కాగా రెండు కాళ్లు ఇరుక్కున్న మహాలక్ష్మి బయటకు లాగి రక్షించడంలో ఆరికతోట బీసీ కాలనీకి చెందిన యువత శ్రమించారు.ఆమెకు ధైర్యం చెబుతూ ఎప్పటికప్పుడు నీరందించడంతోపాటు సహకరించారు. సంఘ టనా స్థలంలో ప్రమాద ఘటన చూడడానికి వందలాది మంది తరలివచ్చారు.
Latest News