by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:29 PM
వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారా అని వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైయస్ఆర్సీపీకి ఉందని ఆయన హెచ్చరించారు. మాజీ ఎంపి నందిగాం సురేష్ అక్రమ కేసుల్లో అరెస్టై నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారని ఆయన అన్నారు. మంగళవారం గుంటూరు జైలులో నందిగం సురేష్‌ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.‘ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునేవాళ్ళం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు.
జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్‌ను ఎలా ఉంచాలి?అనేది చెబుతున్నారు.ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైయస్ఆర్సీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారు. గతంలో ముప్పై ఏళ్ళ క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి.కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్తకొత్త పద్దతులు ఉపయోగిస్తున్నారు. గుంట నక్కల్లా వ్యవహరించడం వైయస్ఆర్సీపీకి తెలియదు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైయస్ఆర్సీపీకి ఉంది. నాలుగేళ్ళలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు’అని సజ్జల హెచ్చరించారు. ఆయన వెంట మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, పార్టీ నేతలు ఉన్నారు.
Latest News