by Suryaa Desk | Tue, Dec 24, 2024, 06:25 PM
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేలా, శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలు, ఆస్తుల గ్లోబల్ ఎక్స్‌ప్యాన్సన్ కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
అలాగే శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ వినిపించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్విమ్స్ ఆస్పత్రికి జాతీయ హోదా కల్పించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. అలాగే తిరుమలకు నడకదారి మార్గంలో కాలినడక వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.
తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం.. తిరుమలలో దర్శనం, వసతులు, సౌకర్యాలపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని.. ఇందుకోసం ఫీడ్ బ్యాక్ మేనేజ్‌మెంట్ సిస్టం ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఏపీ డిజిటల్ కార్పోరేషన్ సహకారంతో భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అలాగే తిరుమల హోటళ్లలో నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా చూసేందుకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.
తిరుమల అన్నప్రసాద విభాగంలో నాణ్యమైన ఆహారాన్ని తయారు చేసేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 258 మంది సిబ్బందిని తీసుకోవడానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుపతిలోని సాంప్రదాయ పాఠశాలకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు నుంచి ఏటా రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు ఆమోదం తెలిపారు. శ్రీవారి భక్తుల ఆహారం, ఆరోగ్య భద్రత కోసం ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు టీటీడీలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు.
అలాగే సర్వ దర్శనం క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం ఆల్వార్ ట్యాంక్ విశ్రాంతి భవనాల నుంచి బాట గంగమ్మ సర్కిల్ మధ్యలో టాయిలెట్స్ నిర్మించనున్నారు. రూ.3.36 కోట్లు ఖర్చుతో 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే ఒంటి మిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి రూ.43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Latest News