by Suryaa Desk | Tue, Dec 24, 2024, 06:31 PM
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఓ ఆగంతకుడు చేసిన పని ఆందోళనకు కారణమైంది. తిరుపతిలోని అన్నమయ్య కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి ఆగంతకులు శాంతాక్లాజ్ టోపీ తొడిగారు. సోమవారం ఈ ఘటన జరిగింది. ప్రధాన కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ ఉండటం స్థానికులు గమనించారు. వెంటనే హిందూ సంఘాలకు ఈ విషయం తెలిసింది. దీంతో అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగిందంటూ హిందూ సంఘాలు మంగళవారం ఆందోళనకు దిగాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దుండగులు వ్యవహరించారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. భజరంగ్ దళ్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
స్థానికంగా ఉన్న సీసీటీవీలను పరిశీలించినప్పుడు ఓ దుండుగుడు అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ తొడిగినట్లు పోలీసులు గుర్తించారు. అతను ఎవరా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తు్న్నారు. ఆకతాయితనంతో ఇలా చేశాడా.. లేదా కావాలనే విద్వేషాలు రెచ్చగొట్టాలనే కుట్రతో ఈ పని చేశాడా అనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుణ్ని గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి అపచారం ఘటనపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.
అన్నమయ్య విగ్రహానికి అపచారం ఘటనలో కారకులను గుర్తించి.. కఠినంగా శిక్షించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. 32 వేల సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామి మనసు గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని భూమన మండిపడ్డారు.సనాతన ధర్మం అని చెప్పే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్న భూమన కరుణాకర్ రెడ్డి.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Latest News