by Suryaa Desk | Tue, Dec 24, 2024, 06:40 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ రానుంది. ఏపీలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన బీపీసీఎల్ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీపీసీఎల్ యాజమాన్యం నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నిఫ్టీ)కి తెలియజేస్తూ ఓ లేఖ రాసింది.
మంగళవారం జరిగిన బీపీసీఎల్ బోర్డు సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కోస్తా తీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ముందస్తు పనులు చేపట్టేందుకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు బీపీసీఎల్ సెక్రటరీ తెలిపారు. ప్రీ ప్రాజెక్టు కార్యక్రమాల్లో భాగంగా గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం అధ్యయనం చేయనున్నారు. రిఫైనరీకి భూసేకరణతో పాటుగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. అలాగే పర్యావరణ అంశాలు, ఇంజనీరింగ్ డిజైన్‌లు వంటివి ప్రీ ప్రాజెక్టు యాక్టివిటీస్ కిందకు వస్తాయి.
మరోవైపు రిఫైనరీ ఏర్పాటు కోసం ఏపీతో పాటుగా గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో బీపీసీఎల్ సీఎండీ కృష్ణ కుమార్ భేటీ తర్వాత.. ఈ ప్రాజెక్టు ఏపీలో చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే రిఫైనరీ, పెట్రోకెమికల్ కారిడార్ నిర్మాణం కోసం సుమారుగా 4 వేల నుంచి 5 వేల వరకూ ఎకరా భూమి అవసరమవుతుందని అంచనా .
ఈ నేపథ్యంలోనే బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కోసం మచిలీపట్నం, నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట ప్రాంతం పేరు కూడా వినిపించింది. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా తూర్పు కోస్తా తీరంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కోసం ప్రీ ప్రాజెక్టు యాక్టివిటీస్ చేపట్టేందుకు బీపీసీఎల్ బోర్డు అనుమతి ఇచ్చింది.
Latest News