by Suryaa Desk | Tue, Dec 24, 2024, 07:39 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ... సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమన్నారు. అయితే చట్టం అందరికీ సమానంగా ఉండాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై సీఎం మాట్లాడిన తీరును తప్పుబట్టారు. ఆయన మాటల్లో ఎక్కడా తటస్థత కనిపించలేదని విమర్శించారు. తెలంగాణలో సూపర్‌స్టార్ ఎవరనే విషయంలో అల్లు అర్జున్‌తో రేవంత్ రెడ్డి పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కూడా నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రధాన నటుడు ఆయనేనని చురక అంటించారు. సంధ్య థియేటర్ ఘటన రాజకీయ రంగు పులుముకుందని, ఒకరిని బలిపశువును చేయడం, వేధించడం సరికాదన్నారు.ప్రధాని నరేంద్రమోదీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం పట్ల అన్నామలై హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రతి దానిని రాజకీయం చేయాలని భావిస్తాయని విమర్శించారు. 140 కోట్ల మంది భారత ప్రజలకు ఆయన అధినేత అని, అలాంటి వ్యక్తి శాంతి, సామరస్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. గత ఏడాది కూడా ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు.
Latest News