by Suryaa Desk | Tue, Dec 24, 2024, 07:41 PM
గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా తయారైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూనివర్సిటీలను సరస్వతీ నిలయాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ మేరకు అనేక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యావంతులను వైస్-చాన్స్ లర్లుగా నియమించేందుకు నోటిఫికేషన్లు ఇచ్చి, సెర్చి కమిటీలను ఏర్పాటు చేశారు. అంతేకాదు, సమర్థ్ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అన్ని యూనివర్సిటీల్లో అమలు చేసేలా ఆదేశాలిచ్చారు. ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్ మెరుగుదలకు కృషి .రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మెరుగుదలకు వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్, మెంటర్‌షిప్ కమిటీలు ఏర్పాటుచేశారు. సమగ్ర పరీక్షల నిర్వహణ వ్యవస్థ ద్వారా పరీక్ష ప్రక్రియల ఆటోమేషన్ కోసం దశలవారీ ప్రణాళిక రూపొందించారు. మెరుగైన యూనివర్సిటీ మేనేజ్ మెంట్ సిస్టమ్ అమలుకోసం ఢిల్లీ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతోపాటు ఈ-సమర్థ్ వ్యవస్థ ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పురోగతిలో ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22% కళాశాలలు న్యాక్ గుర్తింపు పొందగా, 2028 నాటికి నూరుశాతం NAAC అక్రిడిటేషన్ సాధించేందుకు చురుకైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు కొత్త కాలేజీలతో సహా 22 ప్రభుత్వ కళాశాలలకు స్వయంప్రతిపత్తి హోదా కల్పించారు.
Latest News