by Suryaa Desk | Tue, Dec 24, 2024, 10:25 PM
తమ ఉద్యోగులకు అందించే ప్రయోజనాలలో భాగంగా కంపెనీ షేర్లను అందిస్తుంటాయి. దీనినే ఎంప్లాయ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీఎస్) అంటారు. ఇన్ఫోసిస్, విప్రో, ప్లిప్‌కార్ట్ వంటి పెద్ద కంపెనీలు ఇచ్చే స్టాక్ ఆప్షన్ ప్లాన్ ద్వారా కోటీశ్వరులు అయిన ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ఓ దిగ్గజ కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదే డిజిటల్ పేమెంట్స్ యూనికార్న్ రాజోర్‌పే . తమ కంపెనీ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమ ఉద్యోగులందరికీ రూ.1 లక్ష విలువైన ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ ప్రకటిస్తున్నట్లు మంగళవారం తెలిపింది.
బెంగళూరు కేంద్రగా సేవలు అందిస్తున్న రాజోర్ పే సంస్థలో ప్రస్తుతం 3000 మందికిపైగా పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.1 లక్ష విలువైన షేర్లు కేటాయిస్తుండగా మొత్తం ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ విలువ రూ.30 కోట్లకుపైగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని ద్వారా కంపెనీ షేర్లను ఉద్యోగులకు కేటాయిస్తారు. లాకిన్ పీరియడ్ తర్వాత ముందస్తుగా నిర్ణయించిన ధర వద్ద ఈ షేర్లను విక్రయించి డబ్బులు పొందవచ్చు.
'2014లో మేము రాజోర్ పే ప్రారంభించినప్పుడు ఇది ఒక స్టార్టప్ అని అనుకోలేదు. కస్టమర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను తీర్చాలని అనుకున్నాం. చెల్లింపు వ్యవస్థలను సమగ్రపరచడంలో సంక్లిష్టత మాకు ఆసక్తిని కలిగించింది. ఇది ఇప్పటి వరకు సాధారణ అంశం. ఈఎస్ఓపీ చొరవ అనేది మేము ఆవిష్కరణలను కొనసాగించడం, డబ్బు చెల్లింపులను సులభతరం చేయడం, భారతదేశ, అంతర్జాతీయంగా వ్యాపారాలకు మరింత ఎక్కువ విలును సృష్టించడంలో ప్రతి సహచరుడి భాగస్వాములు చేసే మార్గం.' అని రాజోర్ పే సీఈఓ, సహ వ్యవస్థాపకులు రహ్షిల్ మాథుర్ తెలిపారు.
మరోవైపు.. 2022లో రాజోర్ పే 75 మిలియన్ డాలర్లు విలువైన ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ బైబ్యాక్ చేపట్టింది. దీని ద్వారా సుమారు 650 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ప్రయోజనం పొందారు. కంపెనీ పేమెంట్స్ బిజినెస్ ఈ ఆర్థిక సంవత్సరం 2023-24లో మొత్తం రెవెన్యూ రూ.2,501 కోట్లుగా ఉంది. కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ.34 కోట్లుగా చూపించింది. అలాగే వార్షిక పేమెంట్ల విలువ 180 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది.
Latest News