by Suryaa Desk | Tue, Dec 24, 2024, 10:29 PM
కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ఇన్సూరెన్స్‌పై ప్రజల్లో అవగహన పెరిగింది. బీమా తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే, తెలిసినవారు, స్నేహితులు చెప్పారని, తెలిసిన కంపెనీ అని ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. ఒక కంపెనీలో పాలసీ తీసుకుంటున్నప్పుడు ప్రధానంగా చూడాల్సింది క్లెయిమ్ టు సెటిల్మెంట్ రేషియో. దీని అర్థం తమ వద్దకు వచ్చిన క్లెయిమ్స్‌లో ఎన్నింటిని పరిష్కరించారు? ఎన్ని తిరస్కరించారు అనేది తెలుస్తుంది. తక్కువ క్లెయిమ్ తిరస్కరణలు న్న కంపెనీని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. మరి మన దేశంలో అతి తక్కువ క్లెయిమ్స్ రిజెక్ట్ చేసిన కంపెనీ ఏదో తెలుసా?
అతి తక్కువ క్లెయిమ్స్ తిరస్కరించిన కంపెనీల జాబితాలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ తొలి స్థానంలో నిలిచింది. హెల్త్ ఇన్సూరెన్స్ కేటగిరీలో కేవలం 0.2 శాతం క్లెయిమ్స్ మాత్రమే న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ తిరస్కరించింది. ఈ మేరకు 2023, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలతో ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీలు చెబుతున్న అంశాలు, అందుకు విరుద్ధంగా ఉండే అసలు నిజాలను బయటపెట్టింది. హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఓన్ డ్యామేజీ బీమా విభాగంలోనూ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ముందు వరుసలో ఉంది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ ఐఆర్‌డీఏఐ ఆదేశాల మేరకు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ తమ క్లెయిమ్ సెటిల్మెంట్లు, తిరస్కరణకు సంబంధించిన డేటాను తమ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఈ డేటా ప్రకారం ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక రూపొందించింది. అందులో ఆరోగ్య బీమా రంగంలో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 0.2 శాతం తిరస్కరణలతో అగ్రస్థానంలో ఉంది. ఇక ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో 2.9 శాతం క్లెయిమ్స్ తిరస్కరించి రెండో స్థానంలో ఉంది. ఫ్యూచర్ జనరాలి 3.8 శాతం, ఆదిత్య బిర్లా హెల్త్ 3.9 శాతం, శ్రీరామ్ 4.6 శాతం తిరస్కరణలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఓన్ మోటార్ డ్యామేజీ విభాగంలో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 0.5 శాతం క్లెయిమ్స్ తిరస్కరించగా.. ఫ్యూచర్ జనరాలి 1.1 శాతం, ఓరియంటల్ ఇన్సూరెన్స్ 3.3 శాతం, ఇఫ్కో టోక్యో 5.8 శాతం, బజాజ్ ఆలియాంజ్ 5.9 శాతం క్లెయిమ్స్ తిరస్కరించి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Latest News