by Suryaa Desk | Tue, Dec 24, 2024, 10:33 PM
ఇటీవలి కాలంలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్న వారు గణనీయంగా పెరుగుతున్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఖర్చులకు తగినట్లుగా రాబడి ఉండే పథకాలను ఎంచుకుంటున్నారు. అందుకు మ్యూచువల్ ఫండ్స్ సరైన ఎంపికగా భావిస్తున్నారు. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. నెల నెల కొద్ది కొద్దిగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే సిస్టమాటిక్ విత్ డ్రావల్ ప్లాన్ సైతం ఉంటుంది. అయితే, ఇన్వెస్టర్లలో చాలా ప్రశ్నలు దాగి ఉంటాయి. ఓ 53 ఏళ్ల వ్యక్తి అడిగిన ప్రశ్నకు మ్యూచువల్ ఫండ్ నిపుణులు చెప్పిన సమాధానం తెలుసుకుందాం.
ప్రశ్న: నా వయసు 53 సంవత్సరాలు. నేను ప్రైవేట్ రంగంలో పని చేస్తున్నాను. నా ప్రావిడెంట్ ఫండ్‌లో రూ.35 లక్షలు ఉన్నాయి. అలాగే ఎన్‌పీఎస్‌లో రూ.15 లక్షలు ఉన్నాయి. అయినప్పటికీ నా పీఎఫ్ పెన్షన్ చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే, నేను 5 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే ఏ పెన్షన్ ప్లాన్ ద్వారా నెలకు రూ.80,000 నుంచి రూ.1 లక్ష పెన్,న్ పొందవచ్చు?
సమాధానం: ఈ ప్రశ్నకు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ సుమిత్ దుసెజా సమాధానమిచ్చారు. 'పెన్షన్ అందించే యాన్యుటీ ప్లాన్లు సాధారణంగా ఏడాదికి 5-7 శాతం వరకు రిటర్న్స్ ఇస్తాయి. అది కంపెనీ, వడ్డీ రేటు, పెట్టుబడి ప్రారంభించిన సమయంపై ఆధారపడి ఉంటుంది. మీకు నెలకు రూ.80 వేల నుంచి రూ.1 లక్ష పెన్షన్ కావాలంటే మీ కార్పస్ రూ.1.4 కోట్ల నుంచి రూ.2.4 కోట్లు అవుసరమవుతుంది. అది మీకు వచ్చే వడ్డీరేటుపై ఆధారపడి ఉంటుంది. మీకు 6 శాతం రిటర్న్స్ వస్తాయని అనుకుందాం. అప్పుడు మీరు వచ్చే 5 సంవత్సరాల పాటు నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3.44 లక్షల వరకు డిఫర్డ్ యాన్యూటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
అయితే, మీ రిటైర్మెంట్ నాటికి ద్రవ్యోల్బణానికి తగిన విధంగా ఈ ప్లాన్ ద్వారా రాబడి అందుతుందని కచ్చితంగా చెప్పలేం. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు అందించే పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టాలి. అందుకోసం మీరు డైనమిక్ అసెట్ అలొకేషన్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ఆ స్కీమ్స్ దీర్ఘకాలంలో సగటున 8-10 శాతం వార్షిక రాబడులు ఇస్తాయి. 5 సంవత్సరాలు ఇలా పెట్టుబడి కొనసాగించిన తర్వాత మీరు సిస్టమాటిక్ విత్ డ్రావల్ ప్లాన్ ప్రారంభించవచ్చు. అప్పుడు మీ ఫండ్స్ నుంచి మీకు స్థిర రాబడిని అందించేలా ఎంచుకోవచ్చు. ఆ డబ్బులు ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయి. మీ ఆర్థిక అవసరాలకు తగిన విధంగా మీ ఎస్‌డబ్ల్యూపీని మార్చుకోవచ్చు' అని తెలిపారు.
అయితే, ఈ కథనం కేవలం సమాచారం కోసమే. పెట్టుబడిని ప్రోత్సహించేందుకు కాదు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు హైరిస్క్ ఉంటాయి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. నిపుణుల సూచనలు తీసుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.