by Suryaa Desk | Tue, Dec 24, 2024, 10:38 PM
కొన్నిసార్లు మీరు మీ హక్కుల కోసం ప్రభుత్వ సంస్థలపై పోరాడాల్సి ఉంటుంది. ఆదాయపు పన్నులకు సంబంధించి ఈ సందర్భాలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. తమపై ఎక్కువ పన్ను విధించారని, పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోలేకపోయాని ట్యాక్స్ పేయర్లు అధికారులను ఆశ్రయిస్తుంటారు. ఇందుకు ఈ కేసు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87A కింద వచ్చే ట్యాక్స్ రిబేట్ సంబంధించి బాంబే హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జులై 5, 2024 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసిన చాలా మంది ట్యాక్స్ పేయర్లు రిబేట్ క్లెయిమ్ చేసుకునేందుకు అధికారులు నిరాకరించారు. వారికి అర్హత ఉన్నా రిబేట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో దేశవ్యాప్తాంగా ఉన్న ట్యాక్స్ పేయర్లు కోర్టులను ఆశ్రయించారు. తాజాగా ఈ విషయంపై బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది.
సెక్షన్ 87A కింద అర్హులైన ట్యాక్స్ పేయర్లు రిబేట్ క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రివైజ్డ్, బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసేలా నోటీఫికేషన్ జారీ చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ని బాంబే హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. వారందరికీ జనవరి 15, 2025 వరకు గడువు ఇవ్వాలని స్పష్టం చేసింది. సెక్షన్ 87ఏ కింద ట్యాక్స్ రిబేట్ పొందేందుకు అర్హులైన ట్యాక్స్ పేయర్లందరికీ ఈ గడువు పెంపు వర్తించేలా చూడాలని తెలిపింది. అయితే ఇది మధ్యతర ఉపశమనమేనని, తుది తీర్పు జనవరి 9, 2025 రోజున ఇస్తామని తెలిపింది.
ఈ మేరకు డిసెంబర్ 20, 2024 రోజున ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు సెక్షన్ 119 కింద గడువు పెంచాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 31, 2024 నాటికి ఫైల్ చేయాల్సి ఉన్న వారికి కనీసం 15 రోజుల గడువు ఇవ్వాలని తెలిపింది. అంటే జనవరి 15, 2025 వరకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. అర్హులైన వారందరూ సెక్షన్ 87ఏ కింద క్లెయిమ్ చేసుకునేందుకు ఈ గడువు వర్తిస్తుంది.
ఫైనాన్స్ యాక్ట్ 2019 ప్రకారం.. సెక్షన్ 87ఏ కింద ట్యాక్స్ రిబేట్‌ను కేంద్రం పెంచింది. పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి రూ.5 లక్షల లోపు పన్ను ఆదాయం ఉంటే ట్యాక్స్ రిబేట్ రూ.12,500 పొందుతారు. ఇక కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉంటే ట్యాక్స్ రిబేట్ రూ.25 వేల వరకు రిబేట్ వస్తుంది. బాంబే హైకోర్టు నిర్ణయంతో అర్హులైన వారు రూ.25 వేల వరకు రిబేట్ పొందే అవకాశం లభించినట్లయింది.
Latest News