by Suryaa Desk | Wed, Dec 25, 2024, 02:20 PM
క్రిస్మస్ వేళ ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఖర్కీవ్ నగరంపై క్షిపణులతో భారీగా దాడులు చేసింది.ఈ విషయాన్ని ఆ నగర మేయర్ ఇగోర్ టెరెకోవ్ వెల్లడించారు. ''ఖర్కీవ్‌పై భారీగా క్షిపణి దాడులు జరుగుతున్నాయి. పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా నగరం వైపు బాలిస్టిక్ క్షిపణులు వస్తూనే ఉన్నాయి'' అని ఇగోర్ తెలిపారు. నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు. మరోవైపు తాము ఉక్రెయిన్ నుంచి వచ్చిన 59 డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణశాఖ తెలిపింది.కొన్ని నెలలుగా తూర్పు ఉక్రెయిన్ లోకి పుతిన్ సేనలు చొచ్చుకొనివెళ్తున్నాయి. అమెరికా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టేలోగా సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని రష్యా యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఉక్రెయిన్‌కు చెందిన 190 ప్రాంతాలను ఆక్రమించినట్లు మాస్కో ప్రకటించుకుంది. అదే సమయంలో మానవ వనరులు, ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్న జెలెన్‌స్కీ సేనల దూకుడు తగ్గింది.ఇదిలాఉంటే.. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని.. ఎలాంటి ముందస్తు షరతులు పెట్టబోమని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. దాదాపు మూడేళ్లుగా జరుగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తాను ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారాన్ని చేపట్టిన తర్వాత యుద్ధం ఆగుతుందా, శాంతి ప్రక్రియకు ఎలాంటి ప్లాన్ అమలుచేయనున్నారో తెలియాల్సి ఉంది.
Latest News