by Suryaa Desk | Wed, Dec 25, 2024, 02:46 PM
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన చెక్క పెట్టెలో మృతదేహం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న శ్రీధర వర్మ ఇంట్లో పోలీసులు మరో చెక్కపెట్టెను గుర్తించారు. దీంతో శ్రీధర వర్మ మరో హత్యకు ప్లాన్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఎవరిని హత్య చేయాలని ప్రయత్నించాడు.. ఇంకో చెక్క పెట్టె ఎవరి కోసం సిద్ధం చేశాడనే వివరాలను నిందితుడి నుంచి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శ్రీధర్ వర్మ ఇంట్లో అనుమానాస్పద రీతిలో చేతబడి చేసే సామగ్రి, పుస్తకాలు దొరకడం స్థానికులలో భయాందోళనలు రేకెత్తించింది. చెక్క పెట్టెలో పంపిన మృతదేహం కాళ్ల గ్రామానికి చెందిన బర్రె పర్లయ్యదేనని గ్రామస్థులు గుర్తించారు. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా మెలిగే పర్లయ్యను హత్య చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.యండగండి గ్రామానికి చెందిన తులసి అనే మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు పార్సెల్ లో మృతదేహం పంపడం తెలిసిందే. ఈ చెక్క పెట్టెను పంపింది తులసి మరిది శ్రీధర వర్మనే అని పోలీసులు తేల్చారు. శ్రీధర వర్మను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. శ్రీధర వర్మ ఏంచేస్తున్నాడు.. ఆదాయం ఎలా వస్తుంది తదితర విషయాలపై కూపీ లాగుతున్నారు. వదిన తులసిని బెదిరించడానికి తమ కుటుంబంతో ఎలాంటి సంబంధంలేని వ్యక్తిని చంపి ఆ మృతదేహాన్ని పార్సెల్ లో పంపాల్సిన అవసరం ఏముందనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో శ్రీధర వర్మకు సహకరించిన మహిళ ఎవరు.. నిందితుడు ఉపయోగించిన కారు ఎవరిదనే ప్రశ్నలకు జవాబులు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, నిందితుడు మాత్రం వివరాలు వెల్లడించడం లేదని అధికార వర్గాల సమాచారం.
Latest News