by Suryaa Desk | Wed, Dec 25, 2024, 06:30 PM
తిరుమల శ్రీవారి పరకామణి నుంచి విదేశీ కరెన్సీని కాజేసిన రవికుమార్ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. 2023 ఏప్రిల్‌లో వెలుగులోకి వచ్చిన పరకామణి చోరీ కేసుపై ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో చర్చగా మారింది. రూ. 100 కోట్ల విలువైన పరకామణి స్కాంలోని పెద్దల పని తేల్చాలని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ డిమాండ్ చేస్తున్నారు. ఎవరి ఒత్తిడితో కేసును నీరుగార్చారని ఆయన ఆరోపిస్తున్నారు.తిరుమల శ్రీవారి హుండీలో భక్తుల సమర్పించే కానుకలను లెక్కించే పరకామణిలో జరిగిన చోరీ ఇప్పుడు చర్చకు వచ్చింది. పరకామణిలో జరిగే లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే పెద్ద జీయర్ మఠానికి చెందిన ఉద్యోగి రవికుమార్ చేతివాటం వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలంటున్న టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ డిమాండ్‌తో మరోసారి తెర మీదకు వచ్చింది. 2023 ఏప్రిల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఇచ్చిన నివేదిక, లోకయుక్తాలో జరిగిన రాజీ వ్యవహారంపై ఎంక్వయిరీ కమిషన్‌కు డిమాండ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పరకామణిలో పెద్ద జీయర్ తరుపున విధుల్లో ఉన్న సీవీ రవికుమార్ గత కొనేళ్ళుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు 2023 ఏప్రిల్ 29న కేసు నమోదు అయ్యింది.
Latest News