by Suryaa Desk | Wed, Dec 25, 2024, 06:52 PM
నూతన సంవత్సరం సమీపిస్తోంది. ఆ వెంటనే ఓ పదిరోజులకే సంక్రాంతి పండుగ రానుంది. ఇక పెద్ద పండుగ అంటే హడావిడి మామూలుగా ఉండదుగా. కోళ్లపందేలు, సంక్రాంతి సంబరాలు ఒకెత్తయితే.. సినిమాల కోలాహలం మరో ఎత్తు. సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటే.. ఆ మూడు రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదలకానున్నాయి. సంక్రాంతి సెలవులు కావటంతో థియేటర్ల వద్ద కోలాహలం ఏర్పడనుంది. దీంతో సంక్రాంతి పండుగ సీజన్ క్యాష్ చేసుకునేందుకు సినిమా నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపుతో ఆరంభంలోనే కలెక్షన్లు రాబట్టుకోవాలని ప్రయత్ని్స్తుంటారు. అయితే పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వొద్దంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ అందింది.
సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఈ మేరకు.. సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకుండా ఆదేశించాలని సీఎం నారా చంద్రబాబునాయుడును రామకృష్ణ కోరారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇస్తారనే ధైర్యంతో నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నాయని.. ఆ తర్వాత ప్రేక్షకుల జేబుల నుంచి కొల్లగొడుతున్నారంటూ రామకృష్ణ ఆరోపించారు. సినీ ఇండస్ట్రీ ఒత్తిడికి తలొగ్గి తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు..టికెట్ల ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఈ రకంగా దేశంలో ఎక్కడా లేదని రామకృష్ణ విమర్శించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మేల్కొందన్న సీపీఐ రామకృష్ణ.. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అభినందనీయమని లేఖలో ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతించబోమని ప్రకటించాలని సీఎం నారా చంద్రబాబునాయుడిని రామకృష్ణ కోరారు. ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మరి ఈ విజ్ఞప్తి ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేదీ చూడాలి.
Latest News