by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:03 PM
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. కొత్తగా వందేభారత్ తో పాటుగా వందే భారత్ స్లీపర్ కేటాయింపుల కోసం రైల్వే శాఖకు వినతులు పెరుగుతున్నాయి.ఈ క్రమంలో నే ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్ల పొడిగింపు పైన రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. విజయవాడ నుంచి అయోధ్య కు వందేభారత్ స్లీపర్ ఏర్పాటుకు దాదాపుగా ఆమోద ముద్ర లభించింది. ఇక, ఇప్పుడు కొత్త ప్రాంతాలకు ఏపీలో వందేభారత్ పొడిగించేలా నిర్ణయం తీసుకుంటున్నారు.
ఏపీలో వందేభారత్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. ప్రస్తుతం విజయవాడ - చెన్నై మధ్య కొనసాగుతున్న వందేభారత్ ను భీమవరం వరకు పొడిగించాలని రైల్వే శాఖకు ఎంపీల నుంచి వినతులు అందాయి. అయితే, వందేభారత్ నిర్వహణకు వీలుగా భీమవరం లో అవసరమైన మౌలిక వసతులు లేవని అధికారులు వెల్లడించారు. దీంతో, నర్సాపురం వరకు రైలు పొడిగించేలా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నై- విజయవాడ మధ్య ఏడాదిన్నార కాలంగా వందేభారత్ నడుస్తోంది. చెన్నై లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 11.30కి విజయవాడ చేరుతుంది.
కాగా, అదే రైలు 20678 నెంబర్‌తో మధ్యాహ్నం 3.20 గంటల కు బయలుదేరి రాత్రి 9.30కి చెన్నై వెళుతుంది. ఉదయం చెన్నై నుంచి వచ్చి విజయవాడ స్టేషన్‌లో నాలుగు గంటలు ఈ రైలు నిలిచిపోవడం వల్ల ప్లాట్‌ఫారం సమస్య ఏర్పడుతుందని నర్సాపురం రైల్వే అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో విజయవాడలో ప్లాట్ ఫారాల సమస్యల కారణంగా ప్రధాన రైళ్లను అవుటర్ లోనే చాలా సేపు నిలిపివేస్తున్నారు. ఈ అంశాన్ని రైల్వే ఉన్నతాధికారులకు వివరించిన మంత్రి..వందేభారత్ ను పొడిగించాలని కోరారు. దీంతో, అన్ని రకాల చర్చల తరువాత చివరికి భీమవరం స్టేషన్ వరకు పొడిగించేందుకు అంగీకారం తెలిపారు.
అయితే, కొత్తగా సాంకేతిక అంశాలను రైల్వే అధికారులు తెర పైకి తీసుకొస్తున్నారు. దీంతో.. వీటి పైన చర్చించిన కేంద్ర మంత్రి భీమవరంలో సాధ్యం కాకపోతే నరసాపురం వరకు పొడిగించాలని రైల్వే మంత్రిని కోరారు. దీని పైన రైల్వే శాఖ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రతిపాదన అమల్లోకి రానుంది. ఇక, ఇదే సమయంలో వందేభారత్ స్లీపర్ తొలి విడత కేటాయింపుల్లోనే విజయవాడ నుంచి అయోధ్యకు ఒక రైలు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కేటాయింపుల పైన వచ్చే నెల స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Latest News