by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:47 PM
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రస్తుతం రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ లో పర్యటిస్తున్నారు.. కానీ దీనికి ఆద్యుడిని తానేనని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. దేశం మొత్తంమీద దావోస్ లో పర్యటించాలనే ఆలోచన తనకే వచ్చిందని, భారత్ నుంచి దావోస్ లో పర్యటించిన తొలి సీఎం తానేనని చంద్రబాబు పేర్కొన్నారు. ఈమేరకు శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. తన దావోస్ పర్యటన వివరాలను మీడియాతో పంచుకున్నారు. 1997లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో దావోస్ లో పర్యటించానని చంద్రబాబు తెలిపారు.అప్పటి నుంచి సీఎంగా ఉన్న ప్రతి టర్మ్ లోనూ దావోస్ లో పర్యటించి రాష్ట్రానికి విదేశీ పరిశ్రమలను తీసుకొచ్చానని వివరించారు. ఒకప్పుడు ఐటీ గురించి అంతా మాట్లాడుకునే వారని, ఆ సమయంలో తాము హైటెక్ సిటీ నిర్మించామని చంద్రబాబు గుర్తుచేశారు. తొలుత హైటెక్ సిటీని రికార్డు సమయంలో నిర్మించామని, అది పూర్తయ్యాక కంపెనీలను ఆహ్వానించామని వివరించారు. అక్కడ హైటెక్ సిటీతో పాటు సైబర్ సిటీ నిర్మాణం చేపట్టామని తెలిపారు. అప్పట్లో తాను, ఎస్ఎం కృష్ణ విదేశీ పెట్టుబడుల కోసం ఎంతో కష్టపడ్డామని గుర్తుచేసుకున్నారు. 1995 లో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇప్పుడు 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) యుగమని చంద్రబాబు చెప్పారు. తొలినాళ్లలో దావోస్ వెళ్లినపుడు హైదరాబాద్ పేరు చెబితే ఎవరికీ తెలిసేది కాదని, అదెక్కడ ఉందని అడిగే పరిస్థితి ఉండేదని తెలిపారు. అప్పట్లో హైదరాబాద్ కు సరైన ఎయిర్ పోర్ట్ కూడా లేదని చెప్పారు. అలాంటి సమయంలో హైటెక్ సిటీని 14 నెలల్లోనే నిర్మించి, విదేశీ కంపెనీలను ఆహ్వానించామని వివరించారు.అప్పట్లో ఐటీ, ఇప్పుడు ఏఐ యుగం కొనసాగుతోందన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ ను కలిశానని, ఆయన కూడా హైదరాబాద్ గురించి ప్రస్తావించారని చెప్పారు. అప్పట్లో తాను హైదరాబాద్ ను ప్రమోట్ చేసిన విషయాన్ని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ప్రమోట్ చేస్తున్న విషయాన్ని బిల్ గేట్స్ గుర్తుచేశారన్నారు. విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ ను ప్రమోట్ చేసేందుకు అన్ని వేదికలనూ ఉపయోగించుకుంటానని చంద్రబాబు వివరించారు.భవిష్యత్ లో ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఇండస్ట్రీలు, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఈసారి దావోస్ లో ఎక్కువగా గ్రీన్ ఇండస్ట్రీపైనే చర్చ జరిగిందని గుర్తుచేశారు. దాని తర్వాతి స్థానంలో ఏఐపైన చర్చ జరిగిందని వివరించారు. పకృతి వ్యవసాయం ముందుముందు ప్రాధాన్యం సంతరించుకుంటుందని, ఏపీలో ఇప్పుడు 10 లక్షల మంది పకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. 'దావోస్ అంటే క్రైటీరియా కాదు. అదొక నెట్ వర్కింగ్. ప్రభుత్వ అధినేతలే కాదు పారిశ్రామికవేత్తలూ చాలామంది వస్తారు. వారితో నెట్ వర్కింగ్ చేసుకోవాలి. నాలెడ్జ్ పెంచుకోవడం కోసమే దావోస్ కు వెళ్లాలి.అక్కడి నెట్ వర్క్ ను, పరిస్థితులను గమనించి ప్రపంచ పోకడను అర్థం చేసుకోవడంతో పాటు భవిష్యత్తు ఏ రంగానిది, ఎటువైపు అభివృద్ధి జరుగుతుందనేది ఊహించి అటువైపు రాష్ట్రాన్ని నడిపించాలి' అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్ లో తాను, మంత్రి లోకేశ్, మంత్రులు, అధికారులు.. ఇలా అందరమూ అన్ని వేదికలపై ఏపీని ప్రమోట్ చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. జూరిచ్ లో దాదాపు 500 మంది తెలుగు వాళ్లు తనను కలిశారని, అందులో చాలామంది కంపెనీలు పెట్టి విజయవంతంగా నడిపిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వంద దేశాల్లో తెలుగువాళ్లు ఉన్నారని, వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగువాళ్లు ఉంటారని చంద్రబాబు పేర్కొన్నారు.
Latest News