by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:14 PM
ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగింది. వివిధ కంపెనీల దిగ్గజాలతో సీఎం సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. విజయవంతంగా దావోస్ పర్యటన ముగించుకుని సీఎం స్వరాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం మీడియాకు తెలియజేశారు. ‘‘దావోస్ అనేది నాకు కొత్త కాదు.. దావోస్‌కు వెళ్లాలని ట్రెండ్ చేసింది నేనే’’ అని అన్నారు. మొట్టమొదటి సారిగా 1995 ముఖ్యమంత్రి అయ్యాక.. 1997 నుంచి దావోస్‌కు వెళ్లినట్లు తెలిపారు. అప్పట్లో దావోస్‌కు వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నామని.. హైదరాబాద్ అని అంటే ఏ హైదరాబాద్ అని అడిగేవారని.. పాకిస్థాన్‌లో ఉండే హైదరాబాద్ గురించా అని అడిగేవారని అన్నారు. అప్పట్లో హైదరాబాద్‌లో సరైన ఎయిర్‌పోర్టు కూడా లేదన్నారు. దావోస్‌కు వెళ్లేందుకు ఇండియాలో పొలిటీషియన్స్ ఇష్టపడే వారు కాదన్నారు. నేను వెళ్లిన తర్వాతే బెంగళూరు నుంచి సీఎం ఎస్‌ఎమ్ కృష్ణ వచ్చారన్నారు. ఆయనతో అప్పట్లో నాకు పోటీ ఉండేదన్నారు. ‘‘మొన్నటి దావోస్ పర్యటనలో బిల్ గేట్స్ కూడా అప్పట్లో హైదరాబాద్‌ను మీరు ప్రమోట్ చేశారు కదా అని నాతో అన్నారు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేస్తున్నారు అని బిల్‌గేట్స్ నాతో అన్నారు’’ అని తెలిపారు. విధ్వంసానికి గురైన ఏపీని ప్రమోట్ చేసేందుకు ప్రతి వేదికను ఉపయోగించుకొంటున్నానని తెలిపారు.
Latest News