by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:20 PM
ఏలూరు జిల్లా, మండవల్లి మండలం బైరవపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించడంతో పక్షుల వేటగాళ్లకు చెందిన 20 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా మెుత్తం ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. నెల్లూరు జిల్లాకు చెందిన వేటగాళ్లు రెండు దశాబ్దాలుగా బైరవపట్నంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి సమయంలో దోమల నివారణకు ఓ కుటుంబం అగరబత్తీలు వెలిగించింది. అర్దరాత్రి సమయంలో కాయిల్ వల్ల ఆ గుడిసెకు మంటలు అంటుకున్నాయి.అయితే అదే ఇంట్లో పక్షులను వేటాడేందుకు నాటు తుపాకీలో వినియోగించే మందుగుండు సామగ్రి ఉండడంతో దానికీ అగ్ని అంటుకుని ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్‌కు సైతం మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో ప్రమాద తీవ్రగా మరింత పెరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి నిప్పులు పక్కనే ఉన్న ఇళ్లపై పడడంతో ఒకదాని తర్వాత మరొకటి మెుత్తం 20 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.వరసగా పలు ఇళ్లల్లో గ్యాస్ సిడిండర్లు బాంబుల్లా పేలిపోవడంతో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను హుటాహుటిన కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 20 కుటుంబాల ప్రజలు ముందే అప్రమత్తమై ఇళ్ల నుంచి పరుగులు తీయడంతో భారీ ప్రాణనష్టం తప్పింది.
Latest News