by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:25 PM
సామాజిక రుగ్మతలను రూపుమాపి ఆడపిల్లలు స్వేచ్ఛగా ఎదిగే సమాజ ఆవిష్కరణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి పిలుపునిచ్చారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆడపిల్లలు లేని సమాజం చీకటితో సమాన మన్నారు. ఆడపిల్లలు పుట్టకూడదనుకోవడం, బాల్య వివాహాలు చేయడం వంటి రుగ్మతలను నిర్మూ లించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాలను నివారించేందుకు కలెక్టర్ అన్సారియా ప్రత్యేక చొరవ తీసుకొని బంగారు బాల్యం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం తరఫున రూపొందించే ప్రతి పోస్టర్‌లోనూ బంగారు బాల్యం తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా బాలికల భద్రత, ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు. బాల్య వివాహాలను నివారించేం దుకు అవసరమైతే కేజీబీవీ, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో బాలికలకు సీట్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ స్వీయ నిర్ణయం స్థాయికి మహిళలు ఎదగాలన్నారు. ప్రతిబాలిక కనీసం డిగ్రీ పూర్తిచేయాలన్నారు. సమాజంలోని పరిణామాలను గమనిస్తూ సొంత భావాలు వ్యక్తపర్చేలా ఉండాలని, తమశక్తి సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా విజన్ డాక్యుమెంట్‌లో మానవ వనరుల అభివృద్ధి-వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చిందని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు బాలికా స్వేచ్ఛ-బాల్యవివాహాల నివారణ కోసం మద్దతుగా ఏర్పాటు చేసిన బ్యానర్‌పై కలెక్టర్ తమీమ్ అన్సారియా, మేయర్ గంగాడ సుజాతతో కలిసి మంత్రి స్వామి సంతకాలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, హేనసుజన్, కిరణ్‌కుమార్, లక్ష్మానాయక్, అంజల, అనిత, అర్చన, దినేష్‌కుమార్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహం చేసుకోకుండా ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న ఓ విద్యార్థిని చెప్పిన మాటలు ఇతర విద్యార్థులలో స్ఫూర్తిని నింపాయి. తానది దర్శి సమీపంలోని ఒక గ్రామమని, తల్లిదండ్రులు లేరన్నారు. 7వతరగతి పూర్తికాగానే బంధువులు పెళ్లిచేయాలని చూశారని, అది ఇష్టలేక ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శికి తెలియజేశానని తెలిపారు. ప్రస్తుతం బొమ్మరిల్లులో ఉంటూ బీఎస్సీ చదువుకుంటున్నానని ఆమె చెప్పగా మంత్రి స్వామి, కలెక్టర్ అన్సారియాలు అభినందించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
Latest News