by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:27 PM
వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల్లో(పీఏసీఎస్) అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కంప్యూటరీకరణ లేకపోవడంతో గతంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తూ.. కాగితరహిత పాలనకు సన్నాహాలు చేస్తోంది. డిజిటలైజేషన్ పూర్తిచేసి సభ్యులందరితో పొదుపు ఖాతాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రతి రైతుకు ఈకేవైసీ చేసి వివరాలను పూర్తిస్థాయిలో కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు ఆయా సొసైటీల వివరాలు, లావాదేవీలకు సంబంధించి దస్త్రాలు వెళ్లాయి. సహకార సంస్థ, గ్రామ సచివాలయ సిబ్బంది సమన్వయంతో ఈకేవైసీ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,01,671 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే 85 వేల మంది రైతుల ఈకేవైసీ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.
Latest News