by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:29 PM
చిరుతల సంచారం కాస్త తగ్గిందనుకునే లోపే తాజాగా మళ్లీ ఏనుగుల సంచారం అధికారులను కలవర పెడుతోంది. మొదటి ఘాట్‌లో గురువారం ఏనుగులు కనిపించడంతో భక్తులు, టీటీడీ ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం తిరుమలకు సమీపంలో 12 ఏనుగులతో ఓ గుంపు, 13 ఏనుగులతో మరో గుంపు సంచరిస్తున్నాయి. ఆహారం, నీటి కోసం ప్రధాన ఏనుగు రూట్‌మ్యా్‌పను సిద్ధం చేసి ముందుకు సాగుతుందని, దానికి అనుగుణంగా మిగిలినవి అనుసరిస్తాయని అధికారులు చెబుతున్నారు.ఇలా.. పార్వేటమండపం, గోగర్భండ్యాం, శ్రీగంధం వనం మీదుగా కాకులకొండ వెనుకనుంచి మామండూరుకు వెళ్లి.. తిరిగి అవ్వాచారి కొనలోయ మీదుగా ఘాట్‌రోడ్డుకు సమీపానికి వస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఏనుగుల కదలికలతో భక్తులు హడలిపోతున్న క్రమంలో అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తిరుమల జనసంచారంలోకి, ఘాట్‌రోడ్లు, కాలినడక మార్గాల్లోకి ఏనుగులు రాకుండా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.ఇందులో భాగంగానే వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధికారులను టీటీడీ సంప్రదించింది. శుక్రవారం వైల్డ్‌లైఫ్ అధికారుల బృందం పార్వేటమండపం పరిసర ప్రాంతాలతో పాటు ఘాట్‌రోడ్లను పరిశీలించింది. అడవి నుంచి జనావాసాల్లోకి ఏనుగులు రాకుండా రైల్వేపట్టాల తరహాలో ఇనుప రాడ్లతో రైలింగ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని టీటీడీ వ్యక్తపరిచినట్టు తెలిసింది. ఐదారు అడుగుల ఎత్తులో రెండు వరసలతో రైలింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ఏనుగులు తిరుమల పరిసర ప్రాంతాల్లోకి రావనే అభిప్రాయాన్ని టీటీడీ ఫారెస్ట్ అధికారులు వ్యక్తపరిచారు.దీనిపై వైల్డ్‌లైఫ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 29వ తేదీ వైల్డ్‌లైఫ్ ప్రధాన సైంటిస్ట్ తిరుమలకు రానున్నారు. వారంరోజుల్లో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు భక్తులపై ఎలాంటి దాడులు చేయకపోయినప్పటికీ వీడియోలు, ఫొటోలు తీస్తున్నవారిని ఏనుగులు తరిమిన ఘటనలు ఉన్నాయి. ఈక్రమంలో భవిష్యత్తులో ఏనుగుల ద్వారా భక్తులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదనే ఉద్దేశ్యంతో టీటీడీ ఏనుగుల సంచారాన్ని జనవాసాల్లో నివారించేదిశగా అడుగులేస్తోంది.
Latest News