by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:30 PM
గంజాయి నివారణ, బహిరంగ మద్యపాన నిషేధం.. తన తొలి ప్రాధాన్యాలని తిరుపతి నూతన ఎస్పీ హర్షవర్ధనరాజు చెప్పారు. ఇంకా ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ప్రశాంత వాతావరణం కల్పించే పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తానన్నారు. నూతన ఎస్పీగా నియమితులైన హర్షవర్ధనరాజు శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణా, బహిరంగ మద్యపానం నిషేధంపై ఉక్కుపాదం మోపి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక బృందాలు నిరంతరం గస్తీ నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ఇప్పటికే జిల్లాలో ఉన్న బృందాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. తిరుపతి ప్రజలకు మళ్లీ సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, డీజీపీ ద్వారకా తిరుమలరావు తనపై ఉంచిన గురుతర బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేర్చుతానన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అటువంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటానని ఎస్పీ హర్షవర్ధనరాజు పేర్కొన్నారు. పోలీసుల్లో ప్రజల పట్ల జవాబుదారీ తనం పెంచడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు పనిచేసి ప్రజల్లో పోలీసులంటే ఒక నమ్మకం, స్నేహపూర్వక వాతావరణం తీసుకొస్తానన్నారు. సాయంత్రం పూట ప్రతి పోలీసు రోడ్లపై కనపడే విధంగా విజుబుల్ పోలీసింగ్ తీసుకొస్తానన్నారు. తిరుపతిలో ట్రాఫిక్ నియంత్రణకు ఆటో డ్రైవర్లు, వివిధ వాహనాల యజమానులు, నిర్వాహకులతో సమావేశమై చర్యలు చేపడతామన్నారు. కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని ఫ్రీ ట్రాఫిక్ ఏర్పాటు చేయడానికి ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాత ఘటనలు పునరావృతం కాకుండా తిరుమలలో వచ్చే నెల 4న జరగనున్న రథ సప్తమికి అవసరమైన ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసుల్లో మనోధైర్యం తీసుకు వచ్చి వారిలో పనిచేసే వాతావరణం కల్పిస్తామని చెప్పారు. అనంతరం అదనపు ఎస్పీలు రవిమనోహరాచ్చారి, వెంకట్రావు, రామకృష్ణ, శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఎస్పీని కలిసి అభినందనలు తెలిపారు. కాగా, ఉదయం తిరుమల శ్రీవారిని ఎస్పీ హర్షవర్ధనరాజు దర్శించుకున్నారు.
Latest News