by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:44 PM
ఏలూరుకు చెందిన ఫాతిమా అనే మహిళకు ముగ్గురు పిల్లలు. ఒక పాపకు అనారోగ్యంగా ఉండటంతో విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఫాతిమాతో పాటుగా ఆమె భర్త, రెండేళ్ల కుమారుడు వెయిటింగ్ హాలులో ఉంటూ వస్తున్నారు. అయితే గురువారం మధ్యా్హ్నం ఫాతిమా భర్త ఏలూరు వెళ్లారు. పిల్లాడితో కలిసి ఫాతిమా వెయిటింగ్ హాలులో ఉంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం పాపకు పాలుపట్టేందుకు అని ఫాతిమా లోపలకు వెళ్లారు. పాపకు పాలుపట్టి బయటకు వచ్చి చూసేసరికి వెయిటింగ్ హాలులో ఉండాల్సిన రెండేళ్ల కుమారుడు కనిపించలేదు. దీంతో ఫాతిమా ఆస్పత్రి మొత్తం గాలించారు. ఎక్కడా కుమారుడి జాడ తెలియకపోవటంతో విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో బాబు తప్పిపోయాడంటూ ఫిర్యాదుచేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసిన గవర్నర్‌పేట పోలీసులు.. బాలుడి ఆచూకీ గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల్లో ఓ 15 ఏళ్ల బాలిక.. చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ బాలిక బాలుడిని తీసుకెళ్లి ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఆటో నంబరు ఆధారంగా ట్రాక్ చేసిన పోలీసులు.. బెంజిసర్కిల్ వద్ద బాలిక, చిన్నారితో కలిసి ఆటో దిగినట్లు గుర్తించారు. అక్కడి నుంచి కోడూరుకు బస్సులో వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
దీంతో విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు.. కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావుకు మిస్సింగ్ కేసు గురించిన సమాచారం ఇచ్చారు. ఎస్పీ ఆదేశంతో అవనిగడ్డ సీఐ నేతృత్వంలో కోడూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు బాలిక కోసం గాలించారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున బాలుడు, బాలిక కోడూరు ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు అక్కడకు చేరుకోగా.. వీరిని చూసిన భయంతో బాలిక బాలుడిని బురదలో పడేసినట్లు సమాచారం. ఆ వెంటనే బాలుడిని రక్షించిన పోలీసులు.. శుభ్రం చేయించి విజయవాడ పోలీసులకు అప్పగించారు. అనంతరం గవర్నర్ పేట పోలీసులు.. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. మొత్తంగా ఫిర్యాదు చేసిన నాలుగు గంటల్లోనే కిడ్నాపైన బాలుడు.. తల్లి ఒడికి చేరాడు..
అయితే బాలుడిని ఎవరికైనా అమ్మేసి డబ్బులు సంపాదిద్దామనే ఆశతోనే 15 ఏళ్ల బాలిక ఈ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన బాలికది కృష్ణా జిల్లా కోడూరుగా గుర్తించారు. పిల్లలను కిడ్నాప్ చేయాలనే ఉద్దేశంతోనే కొద్ది రోజుల కిందట విజయవాడ పాత ఆస్పత్రికి వచ్చిందని పోలీసులు వివరించారు. ఆస్పత్రికి వచ్చేవారితో పరిచయం పెంచుకుని.. అదను చూసి పిల్లలను ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఫాతిమాతోనూ పరిచయం చేసుకుందని.. ఫాతిమా పాపకు పాలు ఇవ్వడానికి లోనికి వెళ్లగానే బాలుడికి చాక్లెట్ చూపించి అక్కడి నుంచి ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వివరించారు.
Latest News