by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:41 PM
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇదే సమయంలో ఆయనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన కుటుంబం, తన పిల్లలపై విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. "జగన్ ఏ పని ఆదేశిస్తే...ఆ పని చేయడం..ఎవరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం విజయసాయిరెడ్డి పని. రాజకీయంగా కాదు.. వ్యక్తిగతంగా కూడా.. నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయి రెడ్డి. ఈ అబద్ధాలు జగన్ చెప్తే విజయసాయి రెడ్డి చెప్పారు" అని ఆమె పేర్కొన్నారు."జగన్‌ను విజయసాయిరెడ్డి వదిలేశారు అంటే ఎందుకు? సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళుతున్నారు? ప్రాణం పెట్టిన వాళ్లు ఎందుకు జగన్‌ను వీడుతున్నారు? జగన్ నాయకుడుగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకుడుగా ప్రజలను, నమ్ముకున్న వాళ్లను మోసం చేశారు. నా అనుకున్న వాళ్లను కాపాడుకోలేక పోతున్నాడు" అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.విజయసాయిరెడ్డి వైసీపీని వీడటం చిన్న విషయం కాదని షర్మిల అన్నారు. వీసా రెడ్డి వంటి నాయకులే జగన్ ను వదిలేస్తున్నారంటే... పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. నాయకుడిగా జగన్ ఓడిపోయారని అన్నారు. విశ్వసనీయతను కోల్పోయిన నాయకుడు జగన్ అని అన్నారు. ఇక వైఎస్ జగన్ ను బీజేపీకి దత్త పుత్రుడిగా షర్మిల అభివర్ణించారు. జగన్ తనను తాను కాపాడుకోవడానికి విజయసాయిరెడ్డిని బీజేపీకి పంపాడు అని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు విజయసాయిరెడ్డిని పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే విజయసాయి రెడ్డి వెళ్లిపోయాడు అని షర్మిల ఆరోపించారు. "విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు.. నిజాలు చెప్పాలి. మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అని మీకు తెలుసు. వివేకా హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషం. మిగిలిన విషయాలు కూడా బయట పెట్టండి" అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు.
Latest News