గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ముందుకెళుతున్నామ‌న్న సీఎం
 

by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:44 PM

ఏపీకి భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు దావోస్ ప‌ర్య‌ట‌న కొన‌సాగింది. వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సులో భాగంగా నాలుగు రోజుల పాటు ఆయ‌న ప్రఖ్యాత కంపెనీల ఈసీఓలు, ఛైర్మ‌న్ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హించారు. ఈరోజు దావోస్ పర్యటన వివరాలను సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాకు వివరించారు. దావోస్ పర్యటన విజయవంతమైందన్న సీఎం.. విధ్వంసమైన ఏపీని గాడిలో పెడుతున్నామ‌న్నారు. కేవలం 7 నెలల్లోనే ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించామ‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాబోతున్నాయని తెలిపారు. భవిష్యత్ లో ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా తయారుచేస్తామ‌న్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను 4వ సారి సీఎం అయ్యాక ఏపీ బ్రాండ్ ను ప్రపంచమంతా ప్రమోట్ చేస్తున్నాన‌ని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అనుకూలతలను వివరిస్తున్నాన‌ని చెప్పారు. దావోస్ పర్యటనలో 27 సమావేశాల్లో పాల్గొన్నానని చెప్పారు. 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, 3 కాంగ్రెస్ సెషన్స్ కి హాజరైనట్లు తెలిపారు. మంత్రులు లోకేశ్, భరత్... 33 మీటింగ్స్ లో పాల్గొన్నారని చంద్ర‌బాబు చెప్పారు. అలాగే లోకేశ్ 5 రౌండ్ టేబుల్స్, 4 కాంగ్రెస్ సెషన్స్ కి హాజరయ్యారని తెలిపారు. కాంగ్రెస్ సెషన్ లో ఎనర్జీ, ఏఐ గురించి చర్చించామన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులతో కలిసి అడ్రస్ చేశామ‌ని తెలిపారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ గురించి చర్చించిన‌ట్లు పేర్కొన్నారు. ఏపీని పెట్రో కెమికల్ హబ్ గా తయారుచేసే అంశంపై చర్చించామ‌న్నారు. ఏపీకి విశాలమైన సముద్రతీరం ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై దృష్టి పెట్టామ‌ని సీఎం రాబోయే రోజుల్లో ఏపీకి భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి. ఈసారి దావోస్ లో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, నేచర్ ఫామింగ్, ఏఐ, డీప్ టెక్ గురించే అందరూ మాట్లాడారు. ప్రపంచంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఒక చోట కలిసే కేంద్రం దావోస్. సివిల్ ఏవియేషన్ జ్యూరిక్, పెట్రోలియమ్ గ్యాస్ మలేషియన్ కంపెనీ, డీపీ వరల్డ్, ఏపీ మోలార్, మెరెస్క్, డెమెన్ హోల్డింగ్ బీవీ, గ్లోబల్ హెడ్, వాల్ మార్ట్ , పెప్సికో వంటి కంపెనీల ప్రతినిధులను కలిశాను. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించాను. అమరావతిలో పాటు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి ఉన్న అవకాశాలను వివరించాము. రూ. 96 వేల కోట్ల పెట్టుబడితో రామాయపట్నంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను బీపీసీఎల్ ఏర్పాటు చేయబోతోంది. అనకాపల్లి దగ్గర రూ. 1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. అలాగే రూ. 1.87 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతోంది. కాకినాడ కేంద్రంగా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయబోతోన్నాము. గ్రీన్ ఎనర్జీలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నాము. సీఐఐ, ఐఎండీ సహకారంతో అమరావతిలో గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాము. సింగపూర్ లో బిజినెస్ స్కూల్ లో ఐఎండీ బెస్ట్ యూనివర్సిటీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థలను వారే మన అమరావతికి తీసుకొస్తారు. న్యాచురల్ ఫామింగ్ లో ఏపీ దేశానికే నమూనాగా తయారుచేయాలని ప్రణాళిక సిద్ధం చేశామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో మనదేశానికి ప్రపంచ వ్యాప్తంగా స్వర్ణయుగం రాబోతోంది. యువత మనకు అదనపు బలం. జీడీపీ వృద్ధిరేటులోనూ మన దేశం సుధీర్ఘ కాలం అగ్రస్థానంలో నిలవబోతోంది. ఆనాడు హైటెక్ సిటీని 14 నెలల్లో కట్టాము. నేటికీ ఐటీ అంటే హైటెక్ సిటీనే. సైబరాబాద్ నగరాన్నే నిర్మించాం. ఆనాడు మేము మీడియా సిటీ మొదలుపెడితే మీరు హైటెక్ సిటీ నిర్మించారని దుబాయ్ లో కొందరు పారిశ్రామిక వేత్తలు గుర్తుచేశారు. 1995 ఐటీ... 2025లో ఏఐ అని నేను దావోస్ లో చెప్పాను. ఆనాడు నేను ప్రపంచమంతా తిరిగి ఐటీ గురించి చెప్పి హైదరాబాద్ కు కంపెనీలు తీసుకొచ్చాను. హైస్కూళ్లు లేని రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చాను. దీని వల్ల చదువుకున్న యువత వచ్చారు. అవకాశాలు వచ్చాయి. ఐటీలో శిక్షణ ఇస్తూనే ఇంగ్లీషులోనూ శిక్షణ ఇప్పించాము. ఉద్యోగం అడగటం కాదు... ఉద్యోగం ఇచ్చే స్థాయికి రావాలని నేను ఆనాడు మన వాళ్లకు చెప్పాను. నేను జ్యూరిచ్ కి వెళ్లినప్పుడు 12 దేశాల నుంచి 600 మంది తెలుగువారు వచ్చారు. వారిలో 30 శాతం పారిశ్రామికవేత్తలే. అమెరికాలో ఎక్కువ తలసరి ఆదాయం మన తెలుగువారికే వస్తోంది. అమెరికన్ల తలసరి ఆదాయం 60 వేల డాలర్లు కాగా మన వారిది లక్షా 20 వేల డాలర్లు. మన తెలుగు అమెరికాలో 12వ భాష. 100 దేశాల్లో తెలుగువారు ఉన్నారు. రాబోయే ఐదేళ్లలో అన్ని దేశాల్లో మనవారే ఉంటారు. 2047నాటికి వెల్త్ లో మన దేశం అగ్రభాగంలో నిలవనుంది. అందులో 30 శాతం మన తెలుగువారే ఉంటారు. సాధారణమైన వ్యక్తులను అసాధారణమైన వ్యక్తులుగా తయారుచేసేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. ప్రపంచానికి సేవలందించే హబ్ గా ఇండియా తయారుకాబోతోంది. విజయవాడలో కూర్చునే గ్లోబల్ స్థాయిలో పనిచేసే రోజులు రాబోతున్నాయి. నేను విదేశాల్లో ఉన్న మన తెలుగువారికి ఒకటే చెప్పాను. అక్కడే ఉండి పనిచేస్తూ స్వదేశానికీ సేవలు చేయాలని చెప్పాను. గ్రామాల్లో విప్లవం మొదలైంది. విదేశాల్లో ఉంటున్న పిల్లలు సొంతూరు వస్తే ఉండటానికి మంచి ఇళ్లు కడుతున్నారు. ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని రూపుమాపి 7 నెలల్లో ఊహించని ప్రగతి సాధించాము. మన రాష్ట్రాన్ని పెట్రో హబ్ గా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాము. మ్యానుఫ్యాక్చరింగ్ లో గ్రీన్ ఎనర్జీ వినియోగం పెంచాల్సి ఉంది. ఏపీకి గూగుల్ వస్తే గేమ్ ఛేంజర్ అవుతుంది. దావోస్ లో గూగుల్ హెడ్ తో మాట్లాడాము. అలాగే టీసీఎస్ రాకతో విశాఖలో ఐటీ విప్లవం వస్తుంది. 10 వేలమందికి ఉద్యోగ, ఉపాధి లభించనుంది. కేంద్ర సహకారంతో రాష్ట్రం ముందుకెళ్తోంది. అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027 నాటికి పోలవరం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.రైల్వే జోన్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 13,500 కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చింది. 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. 2025-26లో జీఎస్ డీపీ 15 శాతం వృద్ధి చెందితే రాష్ట్ర సంపద రూ. 18.47 లక్షల కోట్లకు చేరుతుంది. సామాన్యుల ఆదాయం పెంచి, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా ముందుకుపోతున్నాము. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదల అభివృధ్ధికి పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా పాలన అందిస్తున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వాళ్లు త‌మ‌ను విమర్శిస్తున్నారని చంద్ర‌బాబు అన్నారు. ఐదేళ్లలో రూ.1000 కోట్ల ప్రాజెక్టయినా తెచ్చారా అని ప్రశ్నించారు. పెట్టుబడుల కోసం దావోస్ వెళితే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. ఒక వ్యక్తి మీద కోపంతో ఒక వ్యవస్థను నాశనం చేయడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని చంద్ర‌బాబు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వానికి నేటికీ విశ్వసనీయత ఉంద‌న్నారు. అమరావతికి అడగగానే మాస్టర్ ప్లాన్ ఉచితంగా తయారుచేసిచ్చార‌ని సీఎం గుర్తు చేశారు. కానీ వారి మీద కేసలు పెట్టి వేధించార‌ని దుయ్య‌బ‌ట్టారు. అమరావతి బ్రాండ్ నాశనం చేశార‌ని సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

Latest News
Vishwabandhu Bharat: India dispatches humanitarian aid to Kurdistan region of Iraq Mon, Jan 27, 2025, 04:46 PM
How can Padma award be given to Gaddar, asks MoS Bandi Sanjay Mon, Jan 27, 2025, 04:44 PM
Assam govt taking multiple initiatives to uplift education sector: CM Sarma Mon, Jan 27, 2025, 04:43 PM
To be recognised is truly special, says Bumrah on winning ICC Men’s Test Cricketer of the Year Mon, Jan 27, 2025, 04:29 PM
Sensex, Nifty slide over 1 pc amid weak global cues, US trade uncertainties Mon, Jan 27, 2025, 04:12 PM