by Suryaa Desk | Sun, Jan 26, 2025, 06:47 PM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఆయన నివాసంలోనే ఇటీవల దాడి జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కత్తిపోట్లకు గురైన సైఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కొన్ని రోజుల కిందటే ముంబయి లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే, భర్త సైఫ్ గాయపడితే భార్య కరీనా కపూర్ ఏం చేస్తోందంటూ విమర్శలు వచ్చాయి. దాడి జరిగిన సమయంలో ఆమె ఎక్కడికి వెళ్లిందని కొందరు, గాయాలతో ఆసుపత్రిపాలైన ఆయనకు కరీనా ఏమాత్రం తోడ్పాటునివ్వలేదని మరికొందరు విమర్శించారు. ఈ నేపథ్యంలో, కరీనా కపూర్ కు మద్దతుగా హీరో అక్షయ్ కుమార్ అర్ధాంగి, మాజీ నటి ట్వింకిల్ ఖన్నా స్పందించారు. సైఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన భార్య కరీనాపై ఎన్నో పుకార్లు పుట్టించారని, ఇది సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. "ఆసుపత్రిలో సైఫ్ పక్కన భార్య లేదని చెబుతున్నారు .దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఓ మహిళపై ఇలాంటి నిందలు రావడాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడకపోతే అతడి భార్య అనుష్క శర్మను నిందిస్తారు... సెలెబ్రిటీల విషయంలోనే కాదు... సామాన్యుల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. పురుషుడు ఇబ్బందుల్లో ఉంటే అతడి భార్యను ఎందుకు నిందిస్తుంటారు?" అని ట్వింకిల్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News