by Suryaa Desk | Sun, Jan 26, 2025, 06:50 PM
ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఏపీ శకటాన్ని ప్రదర్శించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఏపీకి సంబంధించి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఏటికొప్పాక లక్క బొమ్మలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన శకటం ప్రదర్శించడం రాష్ట్రం గర్వించదగిన అంశం అని పేర్కొన్నారు. ఏటికొప్పాక బొమ్మలకు ప్రాచుర్యం కల్పించాలని, కళాకారుల నైపుణ్యం ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. "రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి వచ్చే అతిథులకు ఇచ్చే జ్ఞాపికలలో ఏటికొప్పాక బొమ్మలను భాగం చేయడం జరిగింది. గతంలో ఈ బొమ్మల తయారీ కళలో నైపుణ్యం చాటినందుకు ఇద్దరు కళాకారులు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ఇవాళ ఏటికొప్పాక బొమ్మలతో కూడిన శకటాన్ని రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించిడం కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం" అని పవన్ కల్యాణ్ వివరించారు.
Latest News