by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:53 PM
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, శాసనమండలిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. శాసనసభలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం... స్వేచ్చ, సమానత్వం, ఓటుహక్కు కల్పించిందని, సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 75 ఏళ్లలో 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నామని, రానురాను అసెంబ్లీలో పని దినాలు తగ్గిపోతున్నాయని, బడ్జెట్ సమావేశాలు ఒకప్పుడు 45 రోజులపాటు జరిగేవని అన్నారు. ఇప్పుడు చాలా తక్కువ రోజులు నడుస్తున్నాయని, ఇది చాలా బాధాకరమని అన్నారు. చర్చలు జరిగితేనే లోటుపాట్లు తెలిసేవని, ఏడాదిలో శాసనసభ కనీసం 75 రోజులు నడవాలన్నారు.84 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారని, వారికి అవగాహన కల్పిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వచ్చే నెలలో వారికి ప్రత్యేక శిక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లోక్ సభ స్పీకర్, వెంకయ్య నాయుడు వంటి పెద్దల్ని రప్పించేందుకు కృషి చేస్తున్నామని, మన రాష్ట్రం అగ్రగామిన నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపిచ్చారు. ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, పోలవరం పూర్తయితే రాష్ట్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఏపీలో పించన్ రూ. 4 వేలు ఇస్తుంటే... పాట్నాలో 60 ఏళ్లు దాటిన వారికి కేవలం రూ. 400 ఇస్తున్నారన్నారు. ఏపీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు.
Latest News