by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:05 PM
సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల్లో చంద్రబాబు, కూటమి నేతలు ప్రచారం ఊదరగొట్టారు. మీ హామీలపై మీకే నమ్మకం లేకపోతే ఎలా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అన్నదాత సుఖీభవ అన్నారని... కానీ రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. తల్లికి వందనం పేరుతో ఒక్కో బిడ్డకు రూ.15 వేలు అన్నారని.. కానీ రాష్ట్రంలో ఒక్క బిడ్డకైనా మీరు డబ్బులు ఇచ్చారా అని వైఎస్ షర్మిల నిలదీశారు. తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ పిల్లల ఫీజులు కట్టారని చెప్పారు. మహాశక్తి అన్నారు.. మహిళల బాధ్యత తమది అన్నారని.. కానీ నెలకు రూ.1500 కూడా ఎందుకు ఇవ్వట్లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.ఏడు నెలలుగా అధికారంలో ఉన్న మీరు ఎందుకు హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీలో యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని అంచనా వేశామన్నారు. దేశంలోనే నిరుద్యోగంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. చంద్రబాబు చెప్పిన ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని షర్మిల అన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అని చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు. ఈ హామీల అమలుపై చంద్రబాబు ప్రజలకు ఏం చెబుతారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు అసలు దిక్కు లేదన్నారు. జగన్ జమానాలో చేసిన మోసాలను సరి చేస్తామని చెప్పిన చంద్రబాబు కూడా పేదలను మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అని తాము అంటున్నామన్నారు. ప్రజల కోసం చేసే కార్యక్రమాలను మీడియా కవర్ చేయాలని వైఎస్ షర్మిల అన్నారు.
Latest News