by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:05 PM
శ్రీకాకుళం నగరం జీటీ రోడ్డులో ఉన్న ఓ వస్త్ర షాపింగ్ మాల్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విలువైన వస్త్రాలు అగ్నికి ఆహుతవ్వడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. 12 అగ్నిమాపక వాహనాలు, 100 మంది సిబ్బంది.. 9 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపింగ్ మాల్ నుంచి ఉదయం 7 గంటలకు పొగలు రావడాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది యాజమాన్యానికి సమాచారం అందించారు. తర్వాత శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు వారు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోవడంతో నరసన్నపేట, రణస్థలం, రాజాం, ఆమదాలవలస నుంచి మొత్తం 12 అగ్నిమాపక శకటాలను రప్పించారు. అప్పటికే షాపింగ్ మాల్‌లోని అన్ని అంతస్థులకు మంటలు వ్యాపించాయి. దీంతో విశాఖపట్నం నుంచి బ్రోంటో స్కైలిఫ్టర్‌ను సైతం తీసుకువచ్చారు. కానీ, మాల్‌లోకి వెళ్లే మార్గం ఒక్కటే కావడంతోపాటు మూడువైపులా గోడలు ఉండడంతో మంటలను ఆర్పడం కష్టతరంగా మారింది. దీంతో శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద రంగంలోకి దిగారు. నాలుగు ఎక్స్‌కవేటర్ల సాయంతో షాపింగ్‌మాల్ ముందు ఉన్న షట్టర్లను తొలగించారు. అలాగే, గోడలను సైతం కూల్చివేశారు. అయినా, రెండో అంతస్థు నుంచి దట్టమైన పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. భారీ క్రేన్లను తీసుకు వచ్చి రెండో అంతస్థులోకి వెళ్లి మంటలను అదుపు చేశారు. 8 బృందాలు, 12 అగ్నిమాపక యంత్రాలు, 100 మంది సిబ్బంది.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ షాపింగ్ మాల్‌లో సుమారు 200 మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. మంటలు ఆర్పే సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వస్త్రాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. తమ కళ్లముందే షాపింగ్ మాల్ దగ్ధమవుతుండడాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
నాలుగు బహుళ అంతస్థులు గల ఈ షాపింగ్‌మాల్‌లో కనీస భద్రతా ప్రమాణాలు లేవనే విమర్శలు ఉన్నాయి. పోలీసు, అగ్నిమాపక వాహనాలు ప్రవేశించేందుకు సరిపడ స్థలంతో పాటు ప్రమాదాల సమయంలో లోపలకు ప్రవేశించేందుకు, బయటకు వచ్చేందుకు ఎమర్జెన్సీ మార్గాలు లేవు. ఒక్కటే మార్గం ఉండడంతో అగ్నిమాపక సిబ్బందికి మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. ప్రమాద సమయంలో ఫైర్ సేఫ్టీ అలారం మోగలేదని, యంత్రాలు కూడా పనిచేయలేదని షాపింగ్‌మాల్ సిబ్బందితో పాటు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. ప్రమాదం ఉదయం 7 గంటల సమయంలో జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అంటున్నారు. ఈ విషయమై ఆర్‌ఎఫ్‌వో డి.నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. షాపింగ్‌మాల్‌లో వెంటిలేషన్ పూర్తిగా లేకపోవడంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాల్సి వచ్చిందన్నారు. ఎక్స్‌కవేటర్లు, క్రేన్ల సాయంతో గోడలు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించి మంటలను అదుపుచేశామని తెలిపారు.
Latest News