![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 07:31 AM
విశాఖపట్నం బీచ్‌కు సమీపంలో దాదాపు రూ.2000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా లలూ మాల్‌కు దారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చే సందర్భంలో పాటించాల్సిన నిబంధనలకు పాతర వేస్తూ, ఏకంగా 99 ఏళ్ళకు లీజుకు ఇచ్చేందుకు సిద్దపడటం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా ఏకంగా రూ.170 కోట్ల విలువైన రాయితీలను కూడా సదరు సంస్థకు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన మాట్లాడుతూ..... రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలోని అత్యంత విలువైన సుమారు పదమూడు ఎకరాల భూమిని లులూ మాల్ కు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ సంస్థకు ఏడాదికి ఎకరానికి రూ.50 లక్షలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ భూమిలో లులూ సంస్థ సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్, ఇతర వాణిజ్య సముదాయాలను నిర్మిస్తుంది. వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు బీచ్ పక్కన ఉన్న భూమి ఎకరా వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఒక ప్రైవేటు సంస్థకు ఎలా దారాదత్తం చేస్తారో చెప్పాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత వస్తుందీ అని చూస్తూ నామమాత్రంగానే ఆదాయం లభిస్తుంది. ఇదేనా చంద్రబాబు చెబుతున్న సంపదసృష్టి అని ప్రశ్నించారు.
Latest News