![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:15 PM
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తన హవాను చాటుకుంది. అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. ఎక్కడికక్కడ అధికార కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు తీవ్ర బెదిరింపులకు పాల్పడినా చాలా చోట్ల వారి ఆటలు సాగలేదు. పలు చోట్ల ఎంతగా ఒత్తిడి ఎదురైనా ఎంపీటీసీ/జెడ్పీటీసీ/వార్డు సభ్యులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారుల పక్షానే నిలిచి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పారు. తీవ్ర నిర్బంధాలు.. ప్రలోభాలు.. భయపెట్టడాలు.. దాడులు.. వైఎస్సార్‌సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు.. అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేసినా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తాము గెలిచిన పార్టీ వైఎస్సార్‌సీపీ జెండాను గట్టిగా పట్టుకుని మరోసారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా అధికార టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. ఒక జడ్పీ చైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్‌ఎంపీపీ, 8 కో ఆప్షన్ సభ్యుల స్థానాలు మొత్తం కలిపి 50 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా, 40 స్థానాల్లో (ఇందులో ఒక వైస్ ఎంపీపీ రెబల్) వైఎస్సార్‌సీపీ గెలిచింది. ఆరు స్థానాల్లో టీడీపీ, రెండు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ.. ప్రలోభాలతో గట్టెక్కారు. 7 స్థానాల్లో ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. 210 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం ఎన్నికలు నిర్వహించింది. ఇందులో 184 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక పూర్తయింది. వార్డు సభ్యుల పదవి ఖాళీగా ఉండటం వల్ల 16 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక రద్దయింది. మరో పది పంచాయతీల్ల్లో ఉప సర్పంచు ఎన్నిక వాయిదా పడింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ముత్యాల రామగోవిందరెడ్డి ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు.
Latest News