![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 05:56 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ నెల 30 (ఆదివారం), 31 (సోమవారం) తేదీల్లోనూ పని చేస్తాయని తెలిపింది. ఈ రెండు రోజులూ ప్రభుత్వ సెలవు దినాలైనా సరే.. ఉదయం 11.00 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు యథావిధిగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేస్తారని రెవెన్యూ శాఖ చెప్పింది. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని.. రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చన్నారు.
'2024-2025ఆర్ధిక సంవత్సరం ముగింపుతో మార్చి 30, 31 సెలవు దినాల్లో కూడా అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయాలకు పని దినాలుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ స్టాంపులు & రిజిస్ట్రేషన్ కమిషనర్ అందించిన నివేదిక నేపథ్యంలో.. ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించిన అనంతరం తీసుకుంది. ఉత్తర్వుల ప్రకారం, పై కార్యాలయాలు మార్చి 30 & 31 తేదీల్లో ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ స్టాంపులు , రిజిస్ట్రేషన్ కమిషనర్ & ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈ ఉత్తర్వులను అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి' అని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రార్, డిప్యటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయాలు పనిచేస్తాయి. వాస్తవానికి ఈ నెల 30, 31న సెలవు దినాలు.. 30 ఆదివారం కాగా, 31న రంజాన్ కావడంతో సెలవులు.. కానీ ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ప్రభుత్వం కార్యాలయాలు పనిచేస్తాయంటున్నారు. దీంతో రెండు రోజుల పాటూ రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడకుండా కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఊరట కలిగించిందనే చెప్పాలి.
నాలా చట్టాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో స్థిరాస్తి రంగం ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం లభించనుందని నరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్ అన్నారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై నరెడ్కో ప్రతినిధులు సచివాలయంలో రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ‘నాలా అనుమతులకు 6 నెలలు పడుతోంది. దీంతో ప్రాజెక్టుల అనుమతులు ఆలస్యమై నష్టపోతున్నాము. నాలా చట్టం రద్దు నిర్ణయం స్థిరాస్తి రంగానికి ఎంతో మేలు చేస్తుంది’ అన్నారు నరెడ్కో ప్రతినిధులు. నాలా చట్టం రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై క్రెడాయ్ కూడా స్పందించింది.. ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తుంది అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News