|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 07:53 PM
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యను తొలగించి.. ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను నియమించవచ్చనే ప్రచారం నేపథ్యంలో.. సీఎం కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఊహాగానాలను యతీంద్ర పూర్తిగా తోసిపుచ్చారు. తన తండ్రి ఐదేళ్ల పూర్తి పదవీ కాలం సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం పదవిని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నందున నాయకత్వ మార్పుపై గందరగోళం తలెత్తిందని యతీంద్ర అభిప్రాయపడ్డారు.
"సీఎల్పీ సమావేశంలో ఎన్ని సంవత్సరాలు సీఎం అనే దాని గురించి చర్చించరు. వారు కేవలం సీఎంను మాత్రమే నిర్ణయిస్తారు. అయితే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వ మార్పు ఉండబోదని పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది" అని యతీంద్ర తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని ఆయన గట్టిగా వాదించారు. యతీంద్ర చేసిన ఈ ప్రకటనలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చాలా ఆసక్తికరంగా స్పందించారు. నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్రానికి మంచి జరగనివ్వండి అని వ్యాఖ్యానించారు. సీఎం మార్పుపై ప్రత్యక్షంగా స్పందించకుండా డీకేఎస్ సానుకూలంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. రెండున్నరేళ్ల పాలన పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు డీకే శివకుమార్‌కు అప్పగించేలా పార్టీ అధిష్ఠానం మధ్య పవర్ షేరింగ్ ఒప్పందం కుదిరిందని అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈక్రమంలోనే రెండున్నర సంవత్సరాలు పూర్తి కాగానే.. సీఎం పదవి మారుతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇరువురు నేతలూ.. పదవిని దక్కించుకునేందుకు పెద్ద ఎత్తునే కృషి చేశారు. అధిష్టానాన్ని కలిసేందుకు ప్రయత్నించడం, రాష్ట్ర ముఖ్య నాయకులతో రహస్యంగా సమావేశాలు నిర్వహించడం వంటివన్నీ చేశారు.
ఇలా రోజుకో రకమైన మార్పు రాగా.. కాంగ్రెస్ అధిష్టానం గొడవను సద్దుమణిగేలా చేసింది. ముఖ్యంగా ఇద్దరూ ఓ చోట కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని.. దేశ ప్రజలందరి ముందు పరువు కాపాడుకోవాలని సూచించింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు సైతం అదే పాటించారు. ఇద్దరూ కలిసి అల్పాహారం, భోజనం చేసి మాట్లాడుకున్నారు. తామిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటామని.. తమ మధ్య అసలు గొడవలే లేవని, భవిష్యత్తులోనూ రావనిచెప్పారు. కానీ తాజాగా యతీంద్ర చేసిన ప్రకటనలు, డీకే శివకుమార్ పరోక్ష వ్యాఖ్యలు సీఎం మార్పుపై మరోసారి ఉత్కంఠను పెంచాయి.
Latest News