|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 07:54 PM
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి సంబంధించి కీలకమైన లీగల్ పరిణామం చోటుచేసుకుంది. ఆమెకు భారత పౌరసత్వం రాకముందే ఓటరు జాబితాలో ఆమె పేరును చేర్చారన్న ఆరోపణలపై దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై.. రౌజ్ అవెన్యూలోని సెషన్స్ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్ వికాస్ త్రిపాఠి తరఫు న్యాయవాది వాదిస్తూ.. 1980లో న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గపు ఓటరు జాబితాలో సోనియా గాంధీ పేరును అక్రమంగా చేర్చారని ఆరోపించారు. ఆ తర్వాత దాన్ని తొలగించి మళ్లీ 1983లో ఆమె పేరును తిరిగి చేర్చారన్నారు. అయితే ఈ రెండు సంఘటనలు కూడా పౌరసత్వం రాకముందే జరిగాయని వాదించారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే సోనియా గాంధీకి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 6న జరగనుంది.
వాస్తవానికి ఇదే అంశంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని కోరుతూ త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌ను అదనపు ముఖ్య జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా సెప్టెంబర్ 11వ తేదీన తిరస్కరించారు. మోసం, ఫోర్జరీ నేరాలకు అవసరమైన ప్రాథమిక అంశాలు పిటిషన్‌లో లేవని.. కేవలం రుజువు లేని ఓటరు జాబితా ఫోటో కాపీలపై ఆధారపడడం చట్టబద్ధమైన ఆరోపణలకు సరిపోదని మెజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. కేవలం పౌర వివాదాన్ని క్రిమినల్ ముసుగులో చూపించడం ద్వారా చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించడం తప్ప మరొకటి కాదని మెజిస్ట్రేట్ కోర్టు అభిప్రాయపడింది.
అలాగే పౌరసత్వం, ఎన్నికల జాబితా అర్హతకు సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం కోర్టుకు లేదని.. అది కేంద్రం, భారత ఎన్నికల సంఘం పరిధిలోనిదని స్పష్టం చేసింది. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ.. పిటిషనర్ త్రిపాఠి సెషన్స్ కోర్టును ఆశ్రయించగా తాజాగా సెషన్స్ కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.
Latest News