గోవా క్లబ్ యజమానులకు ఇంటర్‌పోల్ 'బ్లూ కార్నర్ నోటీస్',,,?
 

by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:37 PM

గోవా నైట్‌క్లబ్ ‘బిర్చ్ బై రోమియో లేన్’ అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 25 మంది మరణించిన కొద్ది గంటల్లోనే క్లబ్ యజమానులు.. సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగిన శనివారం రాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదైన కొద్ది గంటల్లోనే.. అంటే ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు లూథ్రా సోదరులు ముంబై నుంచి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు విమానంలో పారిపోయినట్లు గోవా పోలీసులు తెలిపారు. ఈక్రమంలోనే వీరిద్దరికీ ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.


ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న వెంటనే.. పోలీసులు ఢిల్లీలోని లూథ్రా సోదరుల నివాసాలకు వెళ్లారు. కానీ అప్పటికే వారు అక్కడ లేదు. దీంతో వారి ఇళ్ల వద్ద నోటీసులు అతికించారు. అదే రోజు గోవా పోలీసుల అభ్యర్థన మేరకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా వారిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయింది. అయినా వీరు దేశానికి తిరిగి రాకపోవడంతో, ముఖ్యంగా వీరు విదేశాల్లో తలదాచుకుంటుండడంతో.. వారిని పట్టుకునేందుకు గోవా పోలీసులు సీబీఐలోని ఇంటర్‌పోల్ విభాగంతో సమన్వయం చేసుకుంటున్నారు. లూథ్రా సోదరులపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి సీబీఐ ఇంటర్‌పోల్‌ను సంప్రదించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


అసలీ బ్లూ కార్నర్ నోటీసు అంటే ఏమిటి?


బ్లూ కార్నర్ నోటీస్ అంటే నేరానికి సంబంధించి ఒక వ్యక్తి గుర్తింపు, స్థానం లేదా కార్యకలాపాల గురించి సమాచారాన్ని కోరడానికి జారీ చేస్తారు. నేరస్థుడి గురించి తెలిసినా, సరిహద్దుల మీదుగా వారి కదలికలను ట్రాక్ చేయడానికి ఈ నోటీస్ ఉపయోగ పడుతుంది. ఇంటర్‌పోల్ (అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్) 196 సభ్య దేశాలలో నేరాలను అరికట్టడానికి పోలీసులకు సహాయ పడుతుంది. ఇంటర్‌పోల్ జారీ చేసే నోటీసులు అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్లు కావు. కాకపోతే నోటీస్ రంగును బట్టి నేరస్థులను ఏం చేయాలా అనేది తెలుస్తుంది.


ఏయే కలర్ల నోటీసులున్నాయి? వాటి అర్థాలు ఏంటి?


రెడ్ నోటీసు.. నేరస్థుడిని గుర్తించి, అప్పగింత కోసం తాత్కాలికంగా అరెస్ట్ చేయడానికి ఇస్తారు.


బ్లాక్ నోటీస్.. గుర్తించని మృతదేహాల గురించి సమాచారం సేకరించడానికి ఇస్తారు.


యెల్లో నోటీస్.. తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడానికి ఇస్తుంటారు.


గ్రీన్ నోటీస్.. నేర చరిత్ర కారణంగా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తి గురించి హెచ్చరించడానికి ఇస్తారు.


ఆరెంజ్ నోటీస్.. పేలుడు పదార్థాలు వంటి తక్షణ ముప్పు కలిగించే సంఘటన గురించి అప్రమత్తం చేయడానికి ఇస్తుంటారు.


పర్పుల్ నోటీస్.. నేర పద్ధతులు, సాధనాల గురించి సమాచారం అందించడానికి లేదా కోరడానికి ఇస్తుంటారు.

Latest News
2nd ODI: Nitish comes in for India as NZ opt to bowl first; Lennox handed debut Wed, Jan 14, 2026, 02:55 PM
Pakistan to host Australia for 3 T20Is from Jan 29 ahead of T20 WC Wed, Jan 14, 2026, 02:51 PM
MP 'honour killing': Man kills daughter for eloping with relative Wed, Jan 14, 2026, 02:45 PM
Suvendu Adhikari to move court after his defamation notice deadline ends for CM Mamata Banerjee Wed, Jan 14, 2026, 12:57 PM
MP excels in PRAGATI; boosting Infrastructure with 97 pc issue resolution, says CM Yadav Wed, Jan 14, 2026, 12:55 PM