ఈసారి భారత బియ్యంపై ట్రంప్ టారిఫ్ బాంబ్
 

by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:49 PM

భారత్ సహా పలు దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే బియ్యంపై టారిఫ్‌లు విధించవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ.. ఆల్ ఇండియా రైస్ ఎగుమతి సంఘం స్పందించింది. భారతీయ బియ్యం ఎగుమతులపై.. మరీ ముఖ్యంగా బాస్మతి బియ్యం ఎగుమతులపై ట్రంప్ అదనపు సుంకాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ట్రంప్ కొత్త సుంకాలు అమల్లోకి తీసుకువస్తే.. దాని భారం ఎక్కువగా అమెరికన్ వినియోగదారులపైనే పడుతుందని హెచ్చరిస్తున్నారు.


ట్రంప్ విధించే అదనపు సుంకాలు.. బాస్మతియేతర బియ్యంకు సంబంధించినవిగా ఆల్ ఇండియా రైస్ ఎగుమతిదారుల సంఘం భావిస్తోంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో.. భారత్ నుంచి అమెరికాకు దాదాపు 337.10 మిలియన్ డాలర్ల విలువైన బాస్మతి బియ్యం ఎగుమతి అయింది. ఇది బాస్మతియేతర బియ్యం కంటే 5 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పటికే ఉన్న 40 శాతం సుంకం భారం అమెరికా వినియోగదారులపైనే పడుతున్న నేపథ్యంలో.. కొత్త సుంకాలు కూడా వారికే తలకు మించిన భారంగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


భారతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య (ఐఆర్ఈఎఫ్) డేటా ప్రకారం.. అమెరికాకు భారతీయ బియ్యం ఎగుమతుల మొత్తం విలువ దాదాపు 390 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా సుమారు రూ.3,510 కోట్లు ఉన్నట్లు తెలిసింది. ఇక అందులో బాస్మతి బియ్యం విలువ 337.10 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.3028 కోట్లుగా తేలింది. 2.74 లక్ష మెట్రిక్ టన్నుల పరిమాణం ఉంటుందని వెల్లడైంది. భారతీయ బాస్మతి బియ్యానికి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద మార్కెట్‌గా అమెరికా ఉంది.


ఇక బాస్మతియేతర బియ్యం విషయానికి వస్తే.. 61,341 మెట్రిక్ టన్నుల బియ్యం అమెరికాకు ఎగుమతి అయింది. దీని విలువ 54.64 మిలియన్ డాలర్లు అంటే.. మన కరెన్సీలో దాదాపు రూ.500 కోట్లుగా ఉంది. ఇక బాస్మతియేతర బియ్యానికి ప్రపంచంలోనే అమెరికా 24వ అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. అయితే భారత్‌పై ట్రంప్ సుంకాలు పెంచక ముందు భారతీయ బియ్యంపై 10 శాతం సుంకం మాత్రమే ఉండేది.. కానీ 50 శాతం సుంకాలు విధించిన తర్వాత అది కాస్తా 40 శాతానికి పెరిగింది.


గతంలో పెంచిన ఈ 50 శాతం సుంకాల పెంపు ప్రభావం కూడా భారత ఎగుమతులపై పెద్దగా పడటం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎందుకంటే పెరిగిన ఖర్చులో ఎక్కువ భాగం అధిక రిటైల్ ధరల రూపంలో అమెరికన్ వినియోగదారులపైనే విధిస్తున్నారని తెలిపాయి. ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ ప్రకారం.. భారతీయ బాస్మతికి ప్రత్యక్ష ప్రత్యామ్నాయం అమెరికాలో లభించే బియ్యం కాదని తెలిపారు. అంతేకాకుండా.. భారతీయ బాస్మతి బియ్యానికి దాని ప్రత్యేకమైన సువాసన, రుచి, పొడవు కారణంగా గల్ఫ్, దక్షిణాసియా ప్రాంతాల సాంప్రదాయ వంటకాలకు కీలక పదార్థంగా నిలుస్తోంది. ఇక బిర్యానీ వంటి వంటకాలకు బాస్మతి బియ్యం తప్పనిసరి.


అమెరికాలో భారతీయ బియ్యాన్ని ప్రధానంగా గల్ఫ్, మన భారతీయులు ఎక్కువగా వినియోగిస్తారు. భారతీయ వంటకాలకు అమెరికాలో రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతున్నందున భారత బియ్యానికి అక్కడ డిమాండ్ పెరుగుతోంది. కొత్తగా విధించే ఏ సుంకాల భారమైనా అమెరికన్ వినియోగదారులపైనే పడుతుందని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ అంచనా వేసింది. భారతీయ బియ్యం ఎగుమతి పరిశ్రమ బలంగా, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో ఉందని సంబంధిత రంగ నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఇతర దేశాలతో వాణిజ్య భాగస్వామ్యాన్ని భారత్ మరింత పెంచుకుంటోందని.. కొత్త మార్కెట్లలోకి విస్తరిస్తోందని ఇండియన్ రైస్ ఎగుమతిదారుల వైస్ ప్రెసిడెంట్ దేవ్ గార్గ్ పేర్కొన్నారు.


భారత్, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాలు తమ పంటలను తక్కువ ధరకు విక్రయిస్తున్నాయని.. అమెరికాలోని కొంతమంది రైతులు ఆరోపించినట్లు ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. చౌక ధరలకే బియ్యాన్ని అమెరికా మార్కెట్‌లోకి భారీగా డంప్ చేస్తున్నాయని అందుకే వాటిపై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు.


Latest News
PM Modi joins Pongal celebrations at Minister Murugan's home, says Tamil culture shared heritage of all humanity Wed, Jan 14, 2026, 11:52 AM
Two siblings abducted from Ranchi rescued safely after 12 days, two arrested Wed, Jan 14, 2026, 11:51 AM
Pongal shining symbol of richness of Tamil traditions: PM Modi in special letter to TN Wed, Jan 14, 2026, 11:30 AM
National Turmeric Board empowering farmers, promoting exports globally: Piyush Goyal Wed, Jan 14, 2026, 11:27 AM
Karnataka leadership tussle resurfaces as Dy CM Shivakumar shares cryptic post Wed, Jan 14, 2026, 11:25 AM