|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:37 PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల పరకామణి చోరీ కేసులో ప్రాథమిక దర్యాప్తు నివేదిక నమోదు చేయటంతో పాటుగా.. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవినీతి నిరోధక శాఖ డీజీ, సీఐడీలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెసులుబాటు కల్పించింది. అలాగే తిరుమల పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటుగా, ఈ కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తిరుమల పరకామణి కేసులో సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని ఏసీబీ డీజీ, సీఐడీలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సూచించింది.
తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ.. ఏపీ హైకోర్టుకు మంగళవారం అదనపు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ డీజీ, సీఐడీ నివేదికలు పరిశీలించిన హైకోర్టు.. ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తిరుమల పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడైన టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్ కుమార్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సతీష్ కుమార్ మృతదేహం అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాల వద్ద లభ్యం కగా.. పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తులో సతీష్ కుమార్‌ది హత్యగా నిర్ధరించారు. ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది.
ఈ నేపథ్యంలో సతీష్ కుమార్ పోస్టుమార్టం నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు సీల్డు కవర్‌లో అందించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అలాగే కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఐటీలతో సమాచారం పంచుకోవాలని సూచించింది. అనంతరం విచారణను డిసెంబర్ 16వ తేదీకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
2023 మార్చి నెలలో తిరుమల పరకామణిలో చోరీ జరిగింది. టీటీడీ ఉద్యోగి రవి కుమార్ విదేశీ కరెన్సీని చోరీ చేస్తూ టీటీడీ అధికారులకు దొరికిపోయారు. అయితే ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిస్థాయిలో విచారణ జరపలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి టీటీడీ పాలకవర్గం ఈ కేసును.. లోక్ అదాలత్‌తో రాజీ కుదుర్చుకుని మూసివేసిందంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో తిరుమల పరకామణి చోరీ కేసును సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిలను కూడా అధికారులు విచారించారు.
Latest News