|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 09:29 PM
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో నమ్మశక్యం కాని ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌స్టేట్-95 జాతీయ రహదారిపై అత్యవసరంగా క్రాష్ ల్యాండింగ్ అయిన ఓ చిన్న విమానం.. అదే వేగంతో వెళ్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. సోమవారం సాయంత్రం బ్రెవర్డ్ కౌంటీ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు కెమెరాల్లో రికార్డు కాగా.. అవి కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు.
కారుపై ల్యాండ్ అయిన విమానం..
ఈ ఘటన కోకోవా సమీపంలోని మైల్ మార్కర్ 201 వద్ద.. ఐ-95 హైవే దక్షిణ దిశగా వెళ్లే మార్గంలో జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో.. చిన్న విమానం నెమ్మదిగా హైవే వైపు దిగి నేలపై వాలుతున్నప్పుడు, అది వేగాన్ని అదుపు చేసుకోలేకపోయింది. ఈక్రమంలోనే 2023 మోడల్ టయోటా కామ్రీ కారుపైకి దిగి, దాన్ని ఢీకొట్టింది. అనంతరం విమానం కొంత దూరం వెళ్లి కింద పడిపోయింది.
సాధారణంగా ఇంజిన్ ఫెయిల్యూర్ లేదా ఇతర సాంకేతిక సమస్యల కారణంగా పైలట్‌లు రద్దీగా లేని రహదారులపై అత్యవసరంగా దిగాల్సి వస్తుంది. అయితే ఈ ఘటనలో రద్దీగా ఉన్న జాతీయ రహదారిపై కారును ఢీకొట్టడం తీవ్ర సంచలనం సృష్టించింది. అత్యవసర ల్యాండింగ్ అయినప్పటికీ.. విమానం కారును ఢీకొట్టడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని చూస్తుంటే విమానం ఇంజిన్ ఫెయిల్ అయినట్లుగానే అనిపిస్తుందన్నారు.
Latest News