|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 09:39 PM
సోషల్ మీడియా వాడకం వల్ల కలిగి దుష్ప్రయోజనాల గురించి.. నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. సామాజిక మాధ్యమాలకు బానిసలై అందులో నుంచి బయటికి రాలేని వారు చాలా మంది ఇప్పుడు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇక చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడటం పట్ల మరింత ఎక్కువ ఆందోళనకరంగా మారుతోంది. చిన్న వయసులోనే సోషల్ మీడియా బారిన పడి.. చిన్నారులు ఎంతలా మారిపోతున్నారో కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని.. నియత్రణలో ఉంచాలనే డిమాండ్లు ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో చిన్నారులకు.. సోషల్ మీడియా వాడకుండా కఠిన ఆదేశాలు ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్న వేళ.. ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతపై సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద.. 10 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు.. 16 ఏళ్ల లోపు పిల్లలను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో ఆయా సోషల్ మీడియా సంస్థలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు భారత కరెన్సీలో దాదాపు రూ.300 కోట్ల వరకు జరిమానా విధించనున్నట్లు ఆదేశాలు ఇచ్చింది.
అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిషేధాన్ని.. టెక్ కంపెనీలు, భావ ప్రకటనా స్వేచ్ఛ కార్యకర్తలు విమర్శించినప్పటికీ.. తల్లిదండ్రులు, చిన్నారుల న్యాయవాదులు స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని డెన్మార్క్, మలేషియా, బ్రెజిల్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలతో సహా ఇతర దేశాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి.
ఈ నిషేధం మొదట్లో 10 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు వర్తిస్తుంది. వీటిలో టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, థ్రెడ్స్, స్నాప్‌చాట్, రెడ్డిట్, కిక్, ట్విచ్, ఎక్స్ ఉన్నాయి. మరిన్ని కొత్త యాప్‌లు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ జాబితా మారే అవకాశం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ మినహా.. మిగతా 9 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఈ చట్టానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. యూజర్ల వయసును ధృవీకరించడానికి పలు పద్ధతులను ఉపయోగిస్తామని పేర్కొన్నాయి.
వయసు ధృవీకరణ
ఆన్‌లైన్ కార్యకలాపాల ఆధారంగా యూజర్ల వయసుని అంచనా వేయడం లేదా సెల్ఫీ ద్వారా వారి వయసు ఎంత ఉంది అనేది నిర్ధారించనున్నట్లు ఆయా సంస్థలు తెలిపాయి. ఇక కొత్తగా సైన్ ఇన్ చేసినపుడు ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులు, వాటికి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ వివరాలను తనిఖీ చేయనున్నట్లు పేర్కొన్నాయి. సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ.. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఆయా ప్రభుత్వాలు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఒక ప్రత్యక్ష ప్రయోగంగా మారిందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Latest News