|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:00 PM
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్ చేసిన ఓ పోస్టు నెట్టింట తీవ్ర చర్చకు తెరలేపింది. అశ్విన్.. ఉన్నట్లుండి బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సన్నీ లియోన్‌తో పాటు చెన్నైలోని ఓ వీధి చిత్రాన్ని కలిపి పోస్ట్ పెట్టాడు. ఈ ఫొటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
చాలా మంది యూజర్లు.. అశ్విన్ పెట్టిన పోస్టుకు అర్థం ఏంటో తెలుసుకోలేకపోయారు. కేవలం అతడు ఫొటో మాత్రమే షేర్ చేశాడు. దానికి క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. కానీ కొందరు నెటిజన్లు రవిచంద్రన్ అశ్విన్ .. పోస్ట్‌ను డీకోడ్ చేశారు. చాలా క్లియర్‌గా అతడి పోస్టుకు అర్థాన్ని చెప్పారు.
తమిళనాడు యువ క్రికెటర్ సన్నీ సంధుకు తనదైన శైలిలో అభినందనలు చెప్పేందుకు అశ్విన్ ఇలా చేశాడని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్రపై తమిళనాడు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్నీ సంధు 9 బంతుల్లో 30 పరుగులు చేసి సాయి సుదర్శన్‌తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సన్నీ సంధు.. ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. దీంతో అతడి పేరును చెప్పేందుకే అశ్విన్ ఇలా పోస్టు పెట్టాడు. అతడిపై ఫ్రాంఛైజీలు ఫోకస్ పెట్టాయనే అర్థంలో అశ్విన్.. ఈ రెండు ఫొటోలు పెట్టాడు. అతని పేరు అర్థం వచ్చేలా సన్నీ లియోన్‌తో పాటు సంధు(గల్లీ) ఫొటోను షేర్ చేశాడు.
కాగా వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఈ నెల 16న అబుదాబిలో వేలం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,390 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంఛైజీల ఆసక్తి మేరకు అందులోంచి 359 మందినే వేలానికి ఎంపిక చేశారు నిర్వహకులు. ఇక ఆటగాళ్ల బదిలీ ప్రక్రియ తర్వాత పది ఫ్రాంఛైజీల్లో కలిపి 77 ఖాళీలున్నాయి. ఫ్రాంఛైజీలన్నీ కలిపి 46 మంది భారత ఆటగాళ్లను, 31 మంది విదేశీయులను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Latest News