|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:21 PM
డ్రైఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనకు తెలుసు. డ్రైఫ్రూట్స్‌లో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఈ, కాల్షియం, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ బి, నియాసిన్, థయామిన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజూ డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు.
వీటిల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అయితే డ్రైఫ్రూట్స్ తినేప్పుడు మనం చేసే కొన్ని తప్పులు వల్ల వాటిలోని పోషక విలువలు పోతాయని నిపుణులు అంటున్నారు. డ్రైఫ్రూట్స్ ఏ విధంగా తీసుకోవాలి, తీసుకోకూడదో చీఫ్‌సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్‌వంశీ మనకు కొన్ని సూచనలు చేశారు. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం.
ఇలా తినకూడదు
కొందరు డ్రైఫ్రూట్స్‌ను నూనెలో వేయించి, ఉప్పు, కూరం వేసి తింటూ ఉంటారు. ఇలా తింటే వాటిలోని పోషకాలను దూరం చేస్తాయని డాక్టర్ మోహన్‌వంశీ అన్నారు. వాటిలో సోడియం కంటెంట్ పెరిగి, ఆరోగ్యానికి హాని చేస్తుందని అంటున్నారు.
ఎక్కువగా తింటున్నారా?
కొందరు డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది అని అతిగా తింటూ ఉంటారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అని అవసరాన్ని బట్టి మితంగా తీసుకోవాలి అని డాక్టర్ మోహన్‌వంశీ సూచించారు. నట్స్ ఎప్పుడు తీసుకున్నా మంచిదే. అయితే ఉదయం అల్పాహారంగానీ, మధ్యాహ్నం భోజనం తరువాత గానీ, సాయంత్రం చిరుతిండిగా కానీ తీసు కోవచ్చు.
డ్రైఫ్రూట్స్‌ను ఎలా తీసుకోవాలి?
రోజుకు 5 నుంచి 6 బాదం పప్పు, 2 నుంచి 3 వాల్‌నట్స్ తీసుకుంటే మంచిది అని డాక్టర్ మోహన్‌వంశీ సూచించారు. నట్స్ నానబెట్టుకుని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అన్నారు. నానబెట్టడం వల్ల డ్రై ఫ్రూట్స్‌లోని ఎంజైమ్ ఇన్హిబిటర్లు తొలగిపోయి, ఫైబర్ మృదువుగా మారుతుంది. త్వరగా జీర్ణం అవుతాయి. అంతే కాదు, వాటిలోని పోషకాలనూ శరీరం సమర్థవంతంగా గ్రహించగలదు. బాదం, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్ష వంటి వాటిని నానబెట్టి తినడం వల్ల వాటి వేడిని ప్రేరేపించే లక్షణాలు తగ్గుతాయి.
ఈ ప్రయోజనాలు ఉంటాయి
కొన్ని డ్రై ఫ్రూట్స్‌లోని హానికరమైన పదార్థాలు నానబెడితే తొలగిపోతాయి. ఇలా వాటిని నానబెట్టి తినడం వల్ల అవి ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా మారతాయి. అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే మలబద్ధకం దూరం అవుతుంది.
Latest News