|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 05:32 AM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పాక్షికంగా తదుపరి దర్యాప్తు జరపాలని హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.ఈ కేసులో దర్యాప్తును లోతుగా చేయకపోతే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. అయితే, దర్యాప్తు ఇప్పటికే ముగిసిందని, మళ్లీ విచారణకు అవకాశం లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు.ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై దృష్టి సారించాలని సీబీఐకి సూచించింది. ఆ సంభాషణకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు జరపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కోర్టు తాజా ఉత్తర్వులతో ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సునీత వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Latest News