|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 11:56 AM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన మెమోలే ఈ కోటి సంతకాలని, ప్రజల నిర్ణయాలను గౌరవించకుండా నియంతలా ముందుకెళితే ఈ కూటమి ప్రభుత్వం పతనం కావడం ఖాయమని వైయస్ఆర్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తే ఆ నిర్ణయమే ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోవైయస్ఆర్‌సీపీ నిర్వహించిన ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, యువత, ఉద్యోగులు, మేథావులు, వివిధ రంగాల నిపుణులు స్వచ్ఛందంగా తరలివచ్చి కోటి సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారని విడదల రజని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూదికి దూదికి కూడా కరువొచ్చిందని, అంబులెన్సులు మూతబడ్డాయని, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని ఆమె మండిపడ్డారు. చివరికి మంత్రి సైతం ఈ విషయాన్ని అంగీకరించారని వెల్లడించారు. గత వైయస్ఆర్‌సీపీ హయాంలో వైద్యారోగ్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, ఇప్పుడు కూటమి పాలనలో నిర్వీర్యం అవుతున్న తీరుని ప్రజలు గ్రహించారు కాబట్టే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వచ్చందంగా ముందుకొచ్చి మద్ధతు పలుకుతున్నారని విడదల రజని వివరించారు. వైయస్ఆర్‌సీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను డిసెంబర్ 18న మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారి నేతృత్వంలో గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుందని మాజీ మంత్రి విడదల రజని వెల్లడించారు.
Latest News